KCR : కేసీఆర్ గులాబీ ‘జాతీయ’ డొల్లతనం బయటపడిపోయినట్టేగా.?
KCR : దేశంలో భారతీయ జనతా పార్టీని గట్టిగా ఎదిరిస్తున్న పార్టీ ఏదన్నా వుందంటే, ముందు వరుసలో నిలబడేది తృణమూల్ కాంగ్రెస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ తర్వాతే మిగతా పార్టీల పేర్లు వస్తాయి. చట్ట సభల్లో మోడీ సర్కారుకి చుక్కలు చూపించడంలో మమతా బెనర్జీ పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈసారి ఏకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించాలని, తద్వారా ప్రధాని నరేంద్ర మోడీని అయోమయంలోకి నెట్టేయాలని మమతా బెనర్జీ వ్యూహరచన చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండగా నిలబడాలి. ఎందుకంటే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే క్రమంలో కేసీయార్ గతంలోనే మమతా బెనర్జీని పలు సందర్భాల్లో కలిశారు, ఆమెతో జాతీయ రాజకీయాల గురించి చర్చించారు, చర్చలు జరుపుతూనే వున్నారు గనుక. బీజేపీయేతర రాజకీయ పార్టీల్ని కలుపుకుపోయే దిశగా చాలా ప్రయత్నాలు చేస్తున్నానని కేసీయార్ అంటున్నారు. అదే నిజమైతే, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు డుమ్మా కొట్టినట్లు.?
బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హెచ్చరికలు రావడం వల్లే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ వెనక్కి తగ్గారనీ, ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా బీజేపీతో అంటకాగుతున్నారనీ రాజకీయ వర్గాల్లో కొన్ని విమర్శలు వినిపిస్తున్న మాట వాస్తవం. కానీ, బలమెరిగి పోరాటం చేయాలి ఎవరైనా. తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా ఎంపీ సీట్లను లెక్కేస్తే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదు. అదే ఉమ్మడి రాష్ట్రంలో అయితే, లెక్కలు వేరేలా వుండేవి. ఇంతకీ, కేసీయార్ ఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు.? ఇది గులాబీ డొల్లతనంలా భావించొచ్చా.?