KCR – Narendra Modi : తెలంగాణకి మోడీని బూచిలా చూపుతోన్న కేసీయార్.!
KCR – Narendra Modi : గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు.. ఇవన్నీ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తాయా.? అలాగైతే, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎలా విజయఢంకా మోగిస్తున్నట్టు.? నిజమే, పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు సామాన్యుల్ని నిలువునా ముంచేస్తున్నాయి. కానీ, భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ విషయమై ఓ బలమైన కారణం వుంది. అదే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం. అన్నిటికీ ఒకటే మంత్రం.! ధరలెందుకు పెరుగుతున్నాయంటే, తమ అసమర్థమైన పాలనా తీరు పట్ల.. అని ఏ ప్రభుత్వమైనా చెబుతుందా.? ఏదో ఒక కుంటి సాకు వెతుక్కుంటుంది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకే కాదు, చాలా రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం భలేగా దొరుకుతోంది.! అది కుంటి సాకు అని తెలిసినా, జనం.. కొంతమేర ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, బీజేపీని బూచిగా చూపేందుకు నానా తంటాలూ పడ్డారు. అదొక ప్రసహనం.. అనడం అతిశయోక్తి కాదు. అదేంటో, కేసీయార్ ఏం చెప్పినా, ‘నిజమే కదా..’ అనిపిస్తుంది. అంత చక్కగా చెబుతారు ఆయన మాటల్ని. నిజానికి, కేసీయార్ మాటల్లో కొంత మేర నిజం కూడా వుంటుంది. అయితే, ప్రజలకు కావాల్సింది నిజాలు కావు. ప్రజల అవసరాలు మారాయి.. వాటికి అనుగుణంగా పాలకులు తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు. అందుకే, రాష్ట్రాలైనా, కేంద్రమైనా విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ వెళుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి మీద ఇంకొకరు నిందలు వేసుకుంటూ వెళుతున్నారంతే.
మధ్యలో జనమే వెర్రి వెంగళప్పలవుతున్నారు. వాస్తవానికి, కేంద్రం చేసే అప్పుల్నీ, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల్నీ మోయాల్సింది ప్రజలే. అయినాగానీ, ‘మాకేంటి సంబంధం.?’ అన్నట్లు ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కేంద్రం పెట్రో ధరల్ని పెంచింది.. అదే సమయంలో పన్నుల్ని తగ్గించుకుంది. మరి, రాష్ట్రాలెందుకు తగ్గించుకోవడంలేదు.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్. ఓ రెండ్రూపాయలైనా తెలంగాణ ప్రభుత్వం పెట్రో ధరల్ని తగ్గించి వుంటే, అది తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా అడ్వాంటేజ్ అయ్యేదే. బూచి బీజేపీ మాత్రమే కాదు, టీఆర్ఎస్ కూడా.