Ys Jagan : కేసీఆర్ వర్సెస్ వైఎస్ జగన్.. మోడీ విషయంలో ఎవరు చేసింది రైటు.!
Ys Jagan : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ఒకలా వ్యవహరించారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకోలా వ్యవహరించారు. రాజకీయాలు పక్కన పెట్టి, ప్రోటోకాల్ విషయంలో ఎవరైనా హుందగా వ్యవహరించాల్సిందే. నిజానికి, ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి హైద్రాబాద్‌లో ఘనస్వాగతం పలికి వుండాలి. అది ప్రోటోకాల్.! లేదా, సంప్రదాయం అని కూడా అనుకోవచ్చు.
సరే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ముఖ్యమంత్రి కేసీయార్ వెళ్ళి వుంటే.. అది ఇంకాస్త గౌరవంగా వుండి వుండేదేమో.! కానీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వచ్చారు. అంటే, అది పూర్తిగా రాజకీయ కార్యక్రమం. ఎటూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రయత్నాల్లో బీజేపీ వుంది గనుక, అధికార టీఆర్ఎస్ మీద తీవ్రస్థాయి విమర్శల్ని ఆ పార్టీ నేతలు చేస్తారు.
సో, ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకడం శుద్ధ దండగ.. అన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ అధినాయకత్వం వచ్చి వుండొచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా అనుకోలేదు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. కేంద్రంతో విభేదించి సాధించేదేమీ లేదు. అందుకే, ప్రధానికి మర్యాదపూర్వకంగా, ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని తిరిగి వెళ్ళేటప్పుడు, రాష్ట్రం తరఫున వినతుల్ని ఆయనకు అందించారు. ఇదీ జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని దృష్టిలో వైఎస్ జగన్ మంచి మార్కులు కొట్టేశారు.