Komatireddy : బీజేపీలోకి కోమటిరెడ్డి.! తెలంగాణలో మారనున్న రాజకీయ సమీకరణాలు.!
Komatireddy : భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, ఎమ్మెల్యే పదవికి ఈ నెల 8న ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఇదిలా వుంటే, ఢిల్లీకి మరోమారు వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలిసి, వారి ఆశీర్వాదాలు తీసుకోవాలనే యోచనలో రాజగోపాల్ రెడ్డి వున్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక, నియోజకవర్గంలో పర్యటించి, అనుచరులు మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించాలని రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నారట. కాగా, ఢిల్లీ పర్యటనలోనే లాంఛనంగా బీజేపీలో ఆయన చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా వుంటారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. కాగా, రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు, దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి రాబోతున్నారంటూ బీజేపీ తెలంగాణ నేతలు కుండబద్దలుగొట్టి మరీ చెబుతున్నారు. ‘ముందు ముందు మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి..’ అన్నది తెలంగాణ బీజేపీ వాదన. ఇంతకీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతేంటి.? ఆయన తనను తాను కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన్నీ బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పినట్లుగా మీడియాలో బ్రేకింగ్ న్యూసులు దర్శనమిచ్చాయి.
అంతలోనే అవి ఆగిపోయాయి కూడా. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగడంలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. మరోపక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే విడివిడిగా రాజకీయం చేసే బాపతు కాదు. పైగా, ఇద్దరూ విడిపోతే కార్యకర్తల్లో అయోమయం ఏర్పడుతుంది. అందుకే, ఇద్దరూ కలిసే పార్టీ మారాలన్న భావన వారి అనుచరులు, అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ కోమటిరెడ్డి బ్రదర్స్ గనుక బీజేపీలో చేరితే, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సరికొత్తగా మారబోతోందన్నది నిర్వివాదాంశం.