Komatireddy Brothers : తామే సీఎం అన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌లో సైలెంట్ ఎందుకు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Komatireddy Brothers : తామే సీఎం అన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌లో సైలెంట్ ఎందుకు ?

 Authored By ramu | The Telugu News | Updated on :28 September 2024,5:00 pm

Komatireddy Brothers : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ హవాకి రేవంత్ జమానా మొదలయ్యాక బ్రేక్ పడిందా ? స్వరాష్ట్రంలో కాంగ్రేస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ తమకేనంటూ విస్తృత‌ ప్రచారం చేసుకున్నా చివ‌ర‌కు నిరాశే మిగిలింది. రేవంత్ రెడ్డి పార్టీలో చేరడం మొదలు సీఎం అయ్యేంత వరకు బహిరంగంగానే ఆయన‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన కొమ‌టిరెడ్డి బ్రదర్స్ ఆ స్థాయిలో ఇటు పార్టీలో గానీ, అటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సాధించలేకపోవడంతో అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అనుచరులుగా, తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటామని చెప్పినా ఆచరణలో క్యాడర్‌ను నిలబెట్టుకునే చర్యలు చేపట్టకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి మైనస్ పాయింట్.

మరోవైపు రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ద‌క్కిన‌ప్పుడూ బహిరంగంగా వ్యతిరేకించారు. డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచుకున్నాడని పేర్కొంటూ అటు అధిష్టానం పరువుని బజారుకి ఈడ్చారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీ లో చేరడంతో బ్రదర్స్ ఒక‌ద‌శ‌లో పార్టీలో విశ్వాసం సైతం కోల్పోయారు. తన చేరికతో తెలంగాణ లో బీజేపీ బలోపేతం అవుతుందని, కాంగ్రెస్ ని ఖాళీ చేస్తానని డైలాగులు వేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలవడంతో అభాసుపాలయ్యారు. చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదనే వాతావరణంతో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఖమ్మం నేత పొంగులేటి ద్వారా రాజగోపాల్ మళ్లీ హస్తం గూటికి చేరినా పార్టీలో గతంలో ఉన్న పట్టు కోల్పోయారు.

Komatireddy Brothers కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టడికి రేవంత్ వ్యూహం

కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు స్వీయ తప్పిదాలతో ఒక్కొమెట్టు దిగుతూ వస్తే, రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో బ్రదర్స్ ని కట్టడి చేశారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ సొంత జిల్లా నల్లగొండలోనే వారికి ధీటుగా తన టీమ్ ని బలోపేతం చేసుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడకుండా వారిని నొప్పించకుండా బీఆర్ఎస్ నుంచి వేముల వీరేశం, మందుల సామెల్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించ‌డ‌మే కాకుండా ఎమ్మెల్యే టికెట్లిచ్చి గెలిపించుకున్నారు. మరోవైపు పార్టీ వీడి వెళ్లిన కుంభం అనిల్ రెడ్డి ని మళ్ళీ వెనక్కి రప్పించి టికెట్ ఇచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకైక బీసీ అభ్యర్థిగా ఉన్న‌బీర్ల ఐలయ్య కి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడమే కాకుండా విప్ గా అవకాశం కల్పించి తన వైపు తిప్పుకున్నాడు. ఇంకోవైపు తనకు కాంగ్రెస్ లో అండగా నిలిచిన సీనియర్ నేత జానారెడ్డి తనయులు, తన స్నేహితులైన రఘువీర్, జయవీర్ ని ఎంపీ, ఎమ్మెల్యేలుగా తెరమీదకు తెచ్చాడు. తన ఇంకో స్నేహితుడు చామల కిరణ్ కుమార్‌ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ పై పైచేయి సాధించారు.

Komatireddy Brothers మ‌రో పవ‌ర్ పాయింట్‌గా గుత్తా సుఖేంద‌రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ తో మొదటి నుంచి సరైన సంబంధాల్లేని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుండడంతో నల్గొండ లో బ్రదర్స్ కి పోటీగా మరో పవర్ పాయింట్ తయారైంది. సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఇటీవలే రాష్ట్ర డైరీ డెవ‌ల‌ప్‌మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నియామకం బ్రదర్స్‌కు కంటగింపు కలిగించినా చేసేదేమీలేక మిన్నకుండిపోయారు.

Komatireddy Brothers తామే సీఎం అన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌లో సైలెంట్ ఎందుకు

Komatireddy Brothers : తామే సీఎం అన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌లో సైలెంట్ ఎందుకు ?

మరో వైపు తనతో పాటు కాంగ్రెస్ లో చేరి, అసెంబ్లీ టికెట్లు పొందలేకపోయిన పూర్వపు టీడీపీ నేతలు పటేల్ రమేష్ రెడ్డి, బండ్రు శోభారాణి కి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు, పాల్వాయి రజనీకుమారికి టీఎస్ పీఎస్సీ సభ్యురాలిగా అవకాశాలు కల్పించారు. వెంకట రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్ కి రేవంత్ చెక్ పెడితే , మరోవైపున అదే జిల్లాలో, అదే సామజిక వర్గం, ఇంకో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కీలకమైన శాఖలిచ్చి అధిష్టానం ఆయనకి గుర్తింపు ఇచ్చింది. మొత్తంగా అటు అధిష్టానం వద్ద ప్రాబల్యం కోల్పోవడం, ఇటు రేవంత్ వ్యూహాలు ముందు చతికలబడడం, అటు క్యాడర్ లో విశ్వాసం కోల్పోవడంతో ప్రస్తుతానికి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాకే పరిమితం అవ్వాల్సిన అనివార్య ప‌రిస్థితి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది