Krishnapatnam Anandayya : ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం జగన్ పైనా కామెంట్స్?
Krishnapatnam Anandayya : ప్రస్తుతం ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు గురించే చర్చ. అసలు అది నిజంగానే ఆయుర్వేద మందేనా? నిజంగా ఆ మందు వేసుకుంటే కరోనా తగ్గుతుందా? లాంటి ఎన్నో అనుమానాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. నిజానికి.. ఆనందయ్య ఇప్పటికే ఆ కరోనా మందును లక్షల మందికి ఉచితంగా పంచిపెట్టారు. దాన్ని వేసుకున్న వాళ్లందరూ బాగుందని, తమకు కరోనా తగ్గిందని చెప్పారు తప్పితే దాని వల్ల తమకు ఎటువంటి సమస్యలు రాలేదని చెప్పడంతో.. ఆయన మందుకు డిమాండ్ పెరిగింది. అయితే.. ఇది ఆయుర్వేద మందు కాదని.. కేవలం నాటు మందు మాత్రమేనని.. దీన్ని వాడటం, వాడకపోవడం అనేది ప్రజల ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుందని.. దీన్ని ఆయుర్వేద మందుగా మాత్రం పరిగణించలేమని.. ఆ మందును పరిశీలించిన ఆయుష్ అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఐసీఎంఆర్ కు కూడా ఆ మందును టెస్ట్ కు పంపించింది ఏపీ ప్రభుత్వం. ఆ నివేదిక వస్తే కానీ.. తదుపరి ఆ మందు పంపిణీపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు అయితే ఈ మందు పంపిణీని నిలిపి వేయాలని ప్రభుత్వం ఆనందయ్యను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం మందు పంపిణీని నిలిపివేశారు. అయితే.. అక్కడికి జనాలు కూడా వేల సంఖ్యల్లో వస్తుండటంతో మందు తయారీని పెద్ద మొత్తంలో చేయాల్సి వస్తోంది.
Krishnapatnam Anandayya : నేను తయారు చేసింది ఆయుర్వేద మందే
ఈ నేపథ్యంలో తన మందు గురించి, ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆనందయ్య స్పందించారు. నేను తయారు చేసిన మందుపై సీఎం జగన్ సానుకూలంగానే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం నాకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటా. నేను తయారు చేసిన మందు ఆయుర్వేద మందే. అది నాటు మందు కాదు. నేను ప్రజలకు మేలు చేయాలని.. వాళ్లను కరోనా బారి నుంచి కాపాడటం కోసమే ఆ మందును తయారు చేశాను తప్పితే.. ఏదో డబ్బులు సంపాదించడం కోసమో.. పేరు సంపాదించడం కోసమో కాదు. అయితే.. వేల మంది ఒకేసారి తరలివస్తుండటంతో.. అంతమందికి కరోనా మందు తయారు చేయాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందో చూసి.. ప్రభుత్వం అనుమతించాకే మందు పంపిణీని ప్రారంభిస్తాం.. అని ఆనందయ్య స్పష్టం చేశారు.
Krishnapatnam Anandayya : ఆ మందు పేరుతో కొందరు నకిలీ మందు పంపిణీ చేస్తున్నారు
నా ఆయుర్వేద మందు పేరుతో బయట కొందరు నకిలీ మందులు అమ్ముతున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు. దయచేసి అటువంటి మందుల జోలికి పోకండి. కొందరు నా మందును బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. అందుకే.. అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే.. ఏపీకి చెందిన కోటయ్య అనే వ్యక్తికి మందు వేసి నాలుగు రోజులు దాటింది. ఆయనకు ఆయుర్వేద మందు వేయడం వల్లనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పలేం.. అని ఆనందయ్య వెల్లడించారు.