Poker players | పేకాట ఆడేందుకు నదిలోకి వెళ్లిన పేకాట రాయుళ్లు.. తర్వాత ఏమైందంటే.!
Poker players | పేకాటపై పోలీసులు నిఘా పెంచిన నేపథ్యంలో, నెల్లూరులో పేకాట రాయుళ్లు పోలీసుల కళ్లకు చిక్కకుండా పేకాట ఆడేందుకు కొత్త ప్లాన్ వేశారు. నెల్లూరు నగరానికి చెందిన భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన 15 మంది యువకులు, పేకాట ఆడుతూ పోలీసుల దృష్టికి చిక్కకుండా ఉండేందుకు పెన్నా నదిలో బైపాస్ బ్రిడ్జి కింద లైట్లు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడే ప్లాన్ వేశారు.
#image_title
ప్రమాదం తప్పింది..
మొదట ఈ ప్లాన్ సక్సెస్ అయినట్టు అనిపించింది. కానీ అనుకోని విధంగా సోమశిల డ్యామ్ నుంచి నీటి విడుదల కారణంగా వారి ప్రణాళిక తలకిందులైంది. అదే సమయంలో డ్యామ్ నుంచి భారీగా నీరు విడుదల కావడంతో నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. నదిలో పేకాట ఆడుతున్న యువకులు ఒక్కసారిగా నీటిలో పూర్తిగా చిక్కుకుపోయారు. చుట్టూ నీరు చేరడంతో తర్జనభర్జన పడ్డారు. మరణ భయంతో వంతెన మీదుగా వెళ్తున్న స్థానికులను చూసి కేకలు వేసారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన మంత్రి పొట్లూరి నారాయణ, జిల్లా కలెక్టర్, ఎస్పీని అలెర్ట్ చేశారు. వెంటనే అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీసులు సంఘటితంగా భారీ రిస్క్ ఆపరేషన్ చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి నిచ్చెనలు వేసి నదిలోకి దిగిన సిబ్బంది, ఆక్సా లైట్ల వెలుగులో దాదాపు 6 గంటల పాటు ఆపరేషన్ కొనసాగించి 15మంది యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. యువకులను సజీవంగా బయటకు తేర్చడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.