Ganta : గంటా శ్రీనివాస రావుకు అక్కడ లైన్ క్లియర్? మరి లోకేశ్ సంగతి ఏంటి చంద్రబాబు?
Ganta : గంటా శ్రీనివాస్ రావు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పుడు మాత్రం గంటా పేరు కనీసం వినబడటం కూడా లేదు. ఏపీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. గంటా శ్రీనివాస రావు.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినా.. ఇంతవరకు స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. అలాగని.. ఆయన టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారా? అంటే అదీ లేదు. ఏది ఏమైనా.. ఆయన మళ్లీ తన రాజకీయ భవిష్యత్తును నిర్ధేశించుకోవాలని.. అందుకోసమే గంటా శ్రీనివాస రావు తన భవిష్యత్తు కార్యచరణను మొదలు పెట్టబోతున్నారట.
విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గం… టీడీపీ కంచుకోట. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి చనిపోయారు. దీంతో భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడే లేడు. సబ్బం హరి బతికి ఉన్నన్నాళ్లు.. అప్పుడప్పుడు భీమిలి వెళ్లి వస్తుండేవారు. పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారు. మరి ఇప్పుడు.. అసలు భీమిలిని పట్టించుకునే వారే లేరు. మరోవైపు గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు.. అసలు టీడీపీలోనే యాక్టివ్ గా లేరు. మరోవైపు అక్కడ వైసీపీ నుంచి ఏపీ మంత్రి అవంతి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Ganta : భీమిలి కోసం గంటాకు ఆహ్వానం అందిందా?
అందుకే.. టీడీపీ కంచుకోట అయిన భీమిలిని అస్సలు వదులుకోవద్దని టీడీపీ నేతలు కూడా పార్టీ హైకమాండ్ కు చెబుతున్నారట. భీమిలిలో పట్టు ఉన్న గంటాకే భీమిలి బాధ్యతలు అప్పజెప్పాలని చంద్రబాబును కోరుతున్నారట. మరోవైపు చంద్రబాబు మాత్రం.. భీమిలిలో వచ్చే సారి తన కొడుకు లోకేశ్ బాబును పోటీలో ఉంచాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు.. లోకేశ్ ను పోటీలోకి దించాలని భావించినా.. అప్పుడు కొన్ని కారణాల వల్ల లోకేశ్ కు మంగళగిరి టికెట్ దక్కింది. కానీ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన కొడుకు లోకేశ్ ను గెలిపించుకోవాలన్న తపనతో ఉన్న చంద్రబాబు ఎలాగైనా గంటాను పక్కన పెడతారనే వార్తలు వస్తున్నాయి.
కానీ.. గంటా మాత్రం మళ్లీ భీమిలి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీతో ప్రస్తుతం గంటా అంటీముట్టనట్టుగానే ఉంటున్నా.. చంద్రబాబు మళ్లీ గంటాకు భీమిలి బాధ్యతలు అప్పగిస్తారా? అనేది పెద్ద డౌటే. 2024 లో ఎలాగైనా లోకేశ్ కు భీమిలి టికెట్ ఇవ్వాలని ఆశపడుతున్న నేపథ్యంలో.. గంటా మరోసారి మనసు పడిన భీమిలి కథ ఎక్కడికి చేరుతుందో వేచి చూడాల్సిందే.