Telangana : వృద్ధాప్య పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. అసెంబ్లీలో ప్రకటించిన ఎర్రబెల్లి
Telangana : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణ వృద్ధులకు తీపి కబురు అందించారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో 57 ఏళ్లు నిండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఎర్రబెల్లి అన్నారు.
ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 60 ఏళ్లుగా ఉంది. అయితే.. గతంలోనే సీఎం కేసీఆర్ వృద్ధాప్య పెన్షన్ కు అర్హత వయసును తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును మూడేళ్లకు తగ్గించి.. 57 ఏళ్లు దాటి అర్హత కలిగిన అందరికీ పింఛను అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
నిజానికి ఈ హామీ అమలు ఎప్పుడో జరగాల్సింది కానీ.. కరోనా వల్ల లేట్ అయిందని.. ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛను కల్పిస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో… ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి ఎర్రబెల్లి ఈ విషయం చెప్పారు.
Telangana : పెన్షన్ కోసం ప్రభుత్వం ఏడాదికి 11,724 కోట్లు ఖర్చు చేస్తోంది
ఆసరా పెన్షన్ల కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా… 11,724 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నుంచి సరిగ్గా నిధులు రాకున్నా… తక్కువ నిధులు వస్తున్నా… తెలంగాణ ప్రభుత్వమే సొంత ఖర్చులతో పింఛన్లను అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కేలం 6.66 లక్షల మందికి ఒక్కొక్కరికీ 200 రూపాయలు మాత్రమే ఇస్తోందని… కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వృద్ధులకు 2016 రూపాయలు, వికలాంగులకు 3016 రూపాయలను అందజేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పెన్షన్ల కింద సుమారు 40 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని.. వృద్ధాప్య పెన్షన్ కింద 13.2 లక్షలు, వితంతు పెన్షన్ కింద 14.5 లక్షలు, వికలాంగుల పెన్షన్ కింద 5 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.