AP : ఏపీ నుంచి మోడీ కేబినెట్ లోకి ఎవరు?.. విజయసాయిరెడ్డా?.. పవన్ కళ్యాణా?..
AP : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కేంద్ర కేబినెట్ లోకి ఇంకా పాతిక మందిని తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. దీనికితోడు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి ప్రమోషన్, కొందరికి డిమోషన్, మరికొందరికి ఉద్వాసన పలకనున్నారు. దీంతో ఇంకొన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. ఫలితంగా దాదాపు 30 మంది కొత్తవాళ్లకు మినిస్టర్లుగా అవకాశం దక్కనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరికి చోటు లభిస్తుందనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డికి, జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రధాని మోడీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నారు.
మూడేళ్ల తర్వాత ప్రాతినిధ్యం
ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి మూడేళ్ల తర్వాత ఇప్పుడు ప్రాతినిధ్యం దక్కబోతోందని చెబుతున్నారు. 2014 జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేసి విజయం సాధించగా మోడీ మొదటి మంత్రివర్గంలో టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లు బాగానే ఉన్న ఈ రిలేషన్ షిప్ 2018లో బ్రేకప్ అయింది. అప్పటి నుంచి మరెవరూ కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ కూడా సెంట్రల్ కేబినెట్ లో బెర్త్ కావాలని అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మిత్రపక్షం జనసేనకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కమలనాథులు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి, జనసేనకు పొలిటికల్ గా పడదు. దీంతో ఈ రెండు పార్టీలు ఒకే సమయంలో మోడీ కేబినెట్ లో ఎలా పదవులను తీసుకుంటాయి అనేది అర్థంకావట్లేదు.
2025 లక్ష్యంగా.. : AP
ఏపీలో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే టార్గెట్ తో పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఎంకరేజ్ చేయాలని కాషాయం పార్టీ కంకణం కట్టుకుంది. ఈ రెండు పార్టీలతోపాటు స్థానిక బీజేపీ సీనియర్ లీడర్లు కూడా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు తదితరులు మోడీ మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఊహాగానాలకు తెరపడనుందని వివరిస్తున్నారు.