Ysrcp : వైఎస్సార్సీపీలో పండగే పండగ..!
Ysrcp : ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్సీపీలో పండగ వాతావరణం నెలకొంది. నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు త్వరలో నెరవేరనున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లూ రూలింగ్ పార్టీలో సరైన గుర్తింపు కోసం ఎంతో ఓపిక పట్టిన వారికి ఎట్టకేలకు పదోన్నతులు దక్కనున్నాయి. నిజానికి ఇప్పటికే ఈ ప్రమోషన్ల జాతర పూర్తి కావాల్సింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. వైఎస్ జగన్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు ఈ పదవుల పందేరం కోసం కాళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు.
ఎవరెవరికి?.. ఎన్నెన్ని పోస్టులు?..
సుమారు 70 కార్పొరేషన్ల చైర్మన్ల పదవులతోపాటు ఏకంగా 840 డైరెక్టర్ పోస్టులు వైఎస్సార్సీపీ లీడర్లకు దక్కనున్నాయి. ఇందులో చైర్మన్ల పదవులను ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఇవ్వనున్నారు. శాసన సభ ఎన్నికల్లో టికెట్ లభించనివారు, సీనియర్లు పార్టీ కోసం పదవులను త్యాగం చేశారు. వారికి కూడా ఈసారి న్యాయం చేయనున్నారు. డైరెక్టర్ పోస్టులకు క్యాండేట్ల నియామక బాధ్యతను లోకల్ ఎమ్మెల్యేలకు అప్పగించారు. మొత్తమ్మీద ఈ పదవులన్నింటికీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయిందని సమాచారం.
తెర వెనక.. మరెందరో?..: Ysrcp
పొలిటికల్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంతో మంది తెర ముందు, వెనక కష్టపడితే తప్ప విజయం అసాధ్యం. వాళ్లందరికీ ఏదో ఒక విధంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మందికి చిన్న చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తారు. పార్టీకి మూలస్తంభం లాంటివారికి పెద్ద పదవులే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ల కింద వందల సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు. క్రియాశీలక కార్యకర్తలు పూర్తి సమయాన్ని పార్టీ పనుల కోసమే కేటాయిస్తారు. అందువల్ల వాళ్లు తమ కుటుంబాలను పోషించుకోగలిగే స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు గానీ ఉపాధి కూడా చూపాలి. సీనియర్ లీడర్లకు పదవులు లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వ అండ లేకపోతే అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకోలేకపోవచ్చు. చివరికి అది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఊసెత్తకపోవటంతో పార్టీలో స్తబ్ధత నెలకొంది. దాన్ని తొలగించి పార్టీని మళ్లీ ఎన్నికల దిశగా నడిపించేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూనుకోవటం చెప్పుకోదగ్గ పరిణామం.