Ys Jagan : ఆ విషయంలో వెనక్కి తగ్గనున్న వైఎస్ జగన్..!
Ys Jagan : కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెబుతుందంటారు. ఆ కాలం ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలిసొస్తోంది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఒక సమస్య కొలిక్కి వచ్చింది. కొలిక్కి రావటమే కాదు. అనుకోనివిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతోంది. అదే.. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారం. ఇప్పటివరకు ఆ పెద్దల సభలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానిదే మెజారిటీ. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అప్పుడప్పుడూ అక్కడ ఆటంకాలు ఎదురయ్యేవి. ‘‘మూడు రాజధానులు’’ వంటి కొన్ని కీలకమైన బిల్లులను అసెంబ్లీ కౌన్సిల్ లో పాస్ అవకుండా టీడీపీ అడ్డుకుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ శాసన మండలిని ఏకంగా రద్దు చేసి పారేశారు. సంబంధిత తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వ అంగీకారం కోసం పంపారు. అది ప్రస్తుతం అక్కడ పెండింగ్ లో ఉంది.
బీజేపీనీ అడగాల్సిన పనిలేదు..
అపొజిషన్ పార్టీ మీద ఆగ్రహంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు రెండు మూడు సార్లు ప్రధాని మోడీకి రిక్వెస్ట్ చేశారు. కానీ అటు నుంచి పాజిటివ్ స్పందన రాలేదు. ఈ లోగా కాలం గిర్రున తిరిగొచ్చింది. శాసన మండలిలోని టీడీపీ సభ్యులు పదవీ విరమణ చేయటంతో ఖాళీలు ఏర్పడ్డాయి. గవర్నర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నియామకం, ఎన్నిక మొత్తం వైఎస్సార్సీపీ చేతిలోకి వచ్చేసింది. ఈ ప్రక్రియంతా పూర్తయితే శాసన మండలిలో వైఎస్ జగన్ పార్టీదే పైచేయి అవుతుంది. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులు కూడా వైఎస్సార్సీపీకే దక్కనుండటంతో బిల్లుల ఆమోదం విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావు. శాసన మండలి రద్దుకు దయచేసి ఒప్పుకోండి అంటూ బీజేపీని మరోసారి అడగాల్సిన పనీలేదు.
మరో విధంగానూ..: Ys Jagan
శాసన మండలిలోని పరిస్థితులన్నీ వచ్చే నెల నాటికి పూర్తిగా తనకు అనుకూలంగా మారనుండటంతో ఆ సభను రద్దు చేయాలన్న తన నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ ఇక మర్చిపోయినట్లేనని చెబుతున్నారు. తన పార్టీలోని చాలా మంది నాయకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘ఎమ్మెల్సీ’ హామీలు ఇచ్చి ఉన్నారు. ఆ హామీలను నెరవేర్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి శాసన మండలిని కొనసాగిస్తే అది తన పార్టీ నాయకులకే రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఏపీ ప్రభుత్వం పంపిన శాసన మండలి రద్దు నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇన్నాళ్లూ పక్కన పెట్టడం పరోక్షంగా వైఎస్ జగన్ కి ఇలా ఉపయోగపడుతోంది.