Revanth Reddy : రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు? మరోసారి కేసీఆర్ కు భారీ ఝలక్?
Revanth Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. దూకుడు పెంచుతున్నారు. తాజాగా ఆయన రాజీవ్ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
నేను నిర్వహించిన పాదయాత్రలో రైతులు నా దృష్టికి ఎన్నో సమస్యలను తీసుకొచ్చారు. ఆ సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి.. పరిష్కరించాలి.. అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతుల సమస్యలను లేఖ రూపంలో సీఎం కేసీఆర్ కు రాశారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని.. దాన్ని అమలు చేయబోమని.. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి ఈసందర్భంగా డిమాండ్ చేశారు.
Revanth Reddy : రుణమాఫీకి ఇప్పటి వరకు అతీగతీ లేదు
కేసీఆర్ ప్రభుత్వం.. రుణ మాఫీ అంటూ.. ఎరువులు ఫ్రీ అంటూ.. రైతు బంధు అంటూ రైతులను మోసం చేస్తూనే ఉన్నది. అధికారంలోకి రెండోసారి వచ్చి కూడా రుణమాఫీ గురించి ఇప్పటి వరకు అతీగతీ లేదు.. అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతు బంధు డబ్బులను రుణాల వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. వెంటనే రుణమాఫీ నిధులను విడుదల చేయాలి.. అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
2017లోనే తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఉచితంగా యూరియా అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ.. ఇప్పటి వరకు అది అమలు కాలేదు. అందులోనూ ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత వేధిస్తోంది.. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే.. రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం దిగిపోక తప్పదు. మీ ఆటలు ఇక సాగవు. రైతు బంధు తొలి విడతలో కొందరికి అందాయి. మరికొందరికి రెండో విడతలో అందలేదు. అలాగే కేసీఆర్ చెప్పారని రైతులంతా సన్నాలను పండించారు. దీంతో దిగుబడి తగ్గింది.. మద్దతు ధర లేదు. సన్నాలను కొనాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు పంట చేతికొచ్చాక పంటను కొనే దిక్కు లేదు.. అంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.