Revanth Reddy : అక్కడ కేటీఆర్, నమస్తే తెలంగాణ పత్రికకూ భూములున్నాయ్.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన రేవంత్ రెడ్డి?
Revanth Reddy : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ గురించే చర్చ. ఏప్రిల్ 30 వ తారీఖు నుంచి ఆయనపై ఎక్కడ చూసినా కథనాలే, వార్తలే. ఓవైపు ఈటల రాజేందర్ కరోనా నియంత్రణలో బిజీబిజీగా ఉండగా… మరోవైపు మీడియాలో ఈటల భూకబ్జా అంటూ కథనాలు వరుసగా రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న వంద ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఆ లేఖపై వెంటనే స్పందించిన కేసీఆర్.. ఆ భూములపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
మీడియాలో వస్తున్న కథనాలపై వెంటనే స్పందించిన ఈటల.. రాత్రి ప్రెస్ మీట్ పెట్టి.. తను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెల్లారే ఇంకా అధికారులు భూకబ్జాపై విచారణ చేపట్టకముందే… ఈటల రాజేందర్ దగ్గర ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన ఈటల… కావాలని తనపై దుష్ప్రచారం చేశారని వాపోయారు.
అది కట్ చేస్తే.. తాజాగా ఈటల రాజేందర్ ఇష్యూపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి… మొత్తం నిజాలన్నీ ప్రూఫ్స్ తో సహా బయటపెట్టారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని శామీర్ పేట మండలంలో ఉన్న దేవరయాంజల్ దేవాయల భూముల అక్రమణపై రేవంత్ రెడ్డి నిగ్గుతేల్చారు. అక్కడ ఉన్న రామాయలం భూములు 1553 ఎకరాలు అని.. ఆ భూములు అక్రమణకు గురయ్యాయని.. ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో కథనం రావడంపై రేవంత్ రెడ్డి స్పందించారు.
Revanth reddy : దేవుడి మాన్యాలలో సీఎం కేసీఆర్ కుటుంబీకులకే భూములు ఉన్నాయి
1553 ఎకరాలు ఉన్న దేవుడి మాన్యాల భూములు అక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది కానీ.. అక్కడ సీఎం కేసీఆర్ కుటుంబీకులకే భూములు ఉన్నాయి. దేవరయాంజాల్ భూముల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భూమి ఉంది. సర్వే నెంబర్ 437 లో కేసీఆర్ భూమి కొన్నారు. 2009లో సేల్ డీడ్ ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇదే. దేవాదయ భూములను ముందు ఆక్రమించుకున్నదే మంత్రి కేటీఆర్. ఆ తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర్ రావు. ఆయనకు కూడా అక్కడ భూములు ఉన్నాయి. అలాగే.. సర్వే నెంబర్ 658 లో మంత్రి మల్లారెడ్డికి 7 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఎకరాల్లో మల్లారెడ్డి ఫాంహౌజ్ కట్టుకున్నారు. 2015 లో నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు భూములు కొనుక్కున్నారు.. అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
Revanth reddy : ధరణి వెబ్ సైట్ ను సృష్టించిందే ఈ అక్రమాలను గోల్ మాల్ చేయడానికి
దేవాదాయ భూములను గోల్ మాల్ చేయడానికే ధరణి వెబ్ సైట్ ను సృష్టించారు. అసలు.. ధరణిలో భూమిని ఎవరు ఎవరికి అమ్మారు అనే వివరాలే ఉండవు. ఈటల భూకబ్జా చేశారని.. వెంటనే ఆయన్ను మంత్రి పదవిని నుంచి పీకేశారు. మరి.. కేటీఆర్, మంత్రి మల్లారెడ్డిపై కూడా అదే విచారణ చేయించే దమ్ముందా కేసీఆర్ కు. దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. వందల కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. దేవుడి మాన్యాలను మీరు ఆక్రమించుకొని… ఈటల మాత్రమే తప్పు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవడం దేనికి నిదర్శనం.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తా.. ప్రధాని మోదీని కూడా కలుస్తా. ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి… అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.