Vizag Steel Plant : స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ను అడ్డంగా బుక్ చేసేసిన కేంద్రం..?
Vizag Steel Plant : ఏపీలో ప్రస్తుతం తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్న విషయం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దానికి వ్యతిరేకంగా ఎన్నో ఆందోళనలు జరుగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ఎప్పుడైతే తెలిపిందే… అప్పటి నుంచి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే పలు మార్లు భారత్ బంద్, ఏపీ బంద్ జరిగింది. బంద్ లు కూడా విజయవంతమయ్యాయి. మరోసారి సమ్మె చేయడానికి కూడా కార్మిక సంఘాలు రెడీ అవుతున్నా.. కేంద్రంపై ఎంత ఒత్తిడి తెస్తున్నా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రైవేటీకరణపై ఎటువంటి వెనకడుగు వేయట్లేదు. ప్రైవేటీకరణ ఆగదని.. స్పష్టం చేస్తోంది.
అయితే… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని… అంతా కేంద్రమే చేసిందని… ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని.. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా… కేంద్రం ససేమిరా అంటోందని రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటోంది.అందుకే… కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార వైసీపీ పార్టీ కూడా ఆందోళనలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే… వైసీపీ నేతలు కూడా ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్రలు నిర్వహించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే… అసలు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా… స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుంది.. అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే… కేంద్రం కూడా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్నే ఇరికించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
Vizag Steel Plant : దూకుడు పెంచిన నీతి ఆయోగ్
దీనికి సంబంధించి నీతి ఆయోగ్ దూకుడు పెంచింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థలో పెట్టుబడులకు సంబంధించిన ఉపసంహరణ చేయడం, ఆయా సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, అలాగే సంస్థల ఆస్తుల ద్వారా నగదు సేకరణ చేపట్టాలని నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాలకు సూచనలు చేసింది. అలాగే…. నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ప్రాజెక్టు కోసం నోడల్ ఏజెన్సీగా ఏపీ ఇన్ క్యాప్ ను ప్రభుత్వం ఎంపిక చేయాల్సి వచ్చింది.
దీంతో… విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల గురించి, ఆయా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం, నిధుల సేకరణ లాంటి అంశాలపై నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ఆధ్యయనం చేస్తుంది. నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రాలు… ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే… ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ అంశం రాష్ట్రం చేతిలోకి వచ్చినట్టే కదా. ఇన్ క్యాప్… సంస్థ నష్టాలను బేరీజు వేసుకొని పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల ద్వారా నిధుల సేకరణ వంటి అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆధ్యయనాలను చేయించాలి కాబట్టి… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్టే. కేంద్రం మాత్రం సీఎం జగన్ ను, ఏపీ ప్రభుత్వాన్ని భలే ఇరికించేసిందిగా. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి మరి.