Corona Second Wave : భర్తకు శ్వాస అందలేదు.. ఆక్సిజన్ సిలిండర్ లేదు… నోటి ద్వారా తన భర్తకు శ్వాస ఇచ్చినా?
Corona Second Wave : ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులే. ఏ ఆసుపత్రిలో చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోయింది. స్మశానాలు కూడా ఖాళీ లేవు. మొత్తం మీద దేశమంతా అల్లకల్లోలంగా మారింది. ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కరోనా మాత్రం తగ్గడం లేదు. కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. కరోనా వల్ల చాలామందికి శ్వాస అందడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో శ్వాస అందక చాలామంది కరోనా పేషెంట్లు చనిపోతున్నారు.
రోజూ లక్షల్లో కేసులు… వేలల్లో మరణాలు… ప్రస్తుతం కరోనా సృష్టిస్తున్న ప్రళయం ఇదీ. మే నెలలో కేసులు ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే… వీలైనంత వరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. అయితే… ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరినీ కలచవేస్తోంది. ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఓ భార్య… తన భర్తకు నోటి ద్వారా శ్వాస అందిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే దానికి ఆ ఫోటోనే ఉదాహరణ.
Corona Second Wave : శ్వాస అందక మృతి చెందిన ఆగ్రా వాసి
ఆగ్రాకు చెందిన రవికి కరోనా సోకింది. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో వెంటనే ఆయన్ను తన భార్య రేణు… ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. చాలా ఆసుపత్రులు తిరిగినా… ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవు. చివరకు మరో ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో… తన భర్తకు శ్వాస అందడం కష్టంగా మారింది. ఆక్సిజన్ అందక తన భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే… తన భర్తను కాపాడుకోవాలన్న తాపత్రయంతో తన నోటితోనే తన భర్తకు శ్వాస అందించేందుకు ప్రయత్నించింది రేణు. చాలాసార్లు నోటితో శ్వాస ఇవ్వడానికి ప్రయత్నించినా తన భర్త ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది. శ్వాస అందక రవి ప్రాణాలు విడిచాడు. శ్వాస అందించడానికి ఎంత ప్రయత్నించినా తన భర్త ప్రాణం దక్కకపోవడంతో రేణు కన్నీరు మున్నీరు అయింది.