WhatsApp DP : వాట్సాప్ డీపీలో ఆ ఫోటోలు పెడుతున్నారా… తస్మాత్ జాగ్రత్త..!
WhatsApp DP : సెల్ ఫోన్ వాడకం సాధారణం అయిపోయిన నేపథ్యంలో రోజురోజుకూ సైబర్ క్రైమ్ నేరాలు భారీగా నమోదు చేసుకుంటున్నాయి. అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పందాలో నగదు కాజేస్తున్నారు. తాజాగా భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం ఓ వ్యక్తి పాలిట శాపమైంది. అతని డీపీని సేవ్ చేసుకున్న దుండగులు.. అందులోని మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చారు.
ఆపై దానిని అతడి వాట్సాప్‌కే పంపి తన ఖాతాకు నగదు బదిలీ చేయాల్సిందిగా బెదిరించారు. లేదంటే ఈ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతోపాటు బంధువులు, స్నేహితులకు పంపిస్తానని హెచ్చరించారు. కేటుగాళ్ళ తీరుతో ఒక్కసారిగా ఖంగుతిన్న హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సదరు బాధితుడు పరువు కాపాడుకోవాలనే జాగ్రత్తతో వారి ఖాతాకు అక్షరాల రూ. 1.20 లక్షలు బదిలీ చేశాడు.
అయినప్పటికీ నిందితుల నుంచి వేధింపులు ఆగకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కాక ఫేస్బుక్, ఇన్ స్తా వంటి మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం… స్నేహం పేరిట దగ్గరవడం.. ఆపై నమ్మించి సైబర్ నేరగాళ్లు ఇలాగే ఎంతో మందిని నట్టేట ముంచేస్తున్నారు.