Nellore.. సర్వర్ సమస్యపై రేషన్ డీలర్ల ఆందోళన
ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ప్రజలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఈ రేషన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తడం పట్ల రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు గురువారం ఆందోళన చేశారు. మండలంలోని రేషన్ డీలర్లందరూ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద వెయిట్ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తాము కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
సర్వర్ సమస్య వల్ల డీలర్లు ప్రతీ రోజు నిత్యావసరాలు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద సరుకుల కోసం వెయిట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సర్వర్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ మేరకు రేషన్ డీలర్లు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు, ప్రజలు పాల్గొన్నారు.