Political Surveys : రాజకీయ సర్వేల వెనుక అసలు కోణమేంటి.?
Political Surveys : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అంటూ పలు సర్వేలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తుంటాయి. జాతీయ స్థాయిలో ఎక్కువ సర్వేలు జరుగుతాయి. రాష్ట్రాల స్థాయిలోనూ సర్వేలు జరుగుతున్నాయ్. ఆ మాటకొస్తే, నియోజకవర్గాల స్థాయిలోనూ సర్వేలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. సాంకేతిక పెరిగింది. జస్ట్ ఓ ఫోన్ కాల్ ద్వారా సర్వే చేసెయ్యొచ్చు. ఆయా సర్వేలపై జనం ఎలా స్పందిస్తున్నారు.? అన్నదానిపై స్పష్టత వుండదు. సాధారణంగా అయితే, అధికారంలో వున్న పార్టీలు ఈ సర్వేల్ని ఎక్కువగా చేయిస్తుంటాయి. ఆ తర్వాత అధికారం కోసం వెంపర్లాడే పార్టీలు కూడా సర్వేల కోసం గట్టిగానే ఖర్చు చేస్తుంటాయి. ఇది జగమెరిగిన సత్యం.
నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని ఎక్కువగా సర్వేలు చేస్తుంటారు. ఇక్కడ మళ్ళీ లోక్ సభ నియోజకవర్గా వారీగానే ఎక్కువ సర్వేలు జరుగుతుంటాయ్. అయితే, అసలు ఓటర్ల శాతమెంత.? అందులో ఓట్లేసేవారి శాతమెంత.? అసలు ఓటు హక్కు వున్నా, వివిధ కారణాలతో ఓటు వేయడానికి వీల్లేనివారి సంఖ్య ఎంత.? ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, సర్వేల ఫలితాలన్నీ బూటకమేనని తేలిపోతుంటుంది. మీడియా సంస్థలే ఎక్కువగా ఈ సర్వేలను నిర్వహిస్తుంటాయి. మీడియా సంస్థలంటే ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలే.
సో, సర్వేల ఫలితాల్ని నమ్మడానికి వీల్లేదు. వాస్తవ సర్వేల ఫలితాలకీ, వెల్లడయ్యే సర్వేల ఫలితాలకీ మళ్ళీ చాలా తేడా వుంటుంది. నిజానికి, సర్వేలన్నీ నిజమే అయితే.. దాదాపుగా అన్ని సర్వేల్లోనూ ఒకే ఫలితాలు రావు. దానర్థం, సర్వేల ఫలితాల్లో వాస్తవం లేదనే కదా.? అయినాగానీ, ఈ సర్వేలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్యానికి సమాంతరంగా నడుస్తోన్న ఓ భయంకరమైన వ్యవస్థగా ఈ రాజకీయ సర్వేల తీరుని అభివర్ణిస్తుంటారు ప్రజాస్వామ్యవాదులు.