Ponguleti Srinivasa Reddy : కారు దిగి.. కమలం గూటికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి?
Ponguleti Srinivasa Reddy : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి..కారు దిగి… కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. పార్టీ మార్పు విషయమై పొంగులేటి తన అనుచరులతో ఇప్పటికే చర్చించారని తెలుస్తోంది. తన అనుచరులను సంప్రదించిన తర్వాతనే పొంగులేటి ఓ నిర్ణయానికి వచ్చారని, తన గాడ్ ఫాదర్‌తోనూ పొంగులేటి ఈ విషయమై మాట్లాడారని టాక్.పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగారు.
కానీ, ఇటీవల కాలంలో ఆయన పెద్దగా కనబడటం లేదు. 2014లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన పొంగులేటి.. మరో నాలుగు అసెంబ్లీ స్థానాల గెలుపులోనూ కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి అధికార పార్టీ గులాబీ గూటికి చేరారు. అలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరే పార్టీలోకి వెళ్లినప్పటికీ తన రాజకీయ గాడ్ ఫాదర్ జగన్ అని భావిస్తారని సమాచారం. కాగా, తాను కమలంగూటికి వెళ్లడం గురించి కూడా పొంగులేటి జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది.ఖమ్మం ఎంపీ స్థానాని తనకు కాకుండా నామా నాగేశ్వర్ రావుకు కేటాయించిన నాటి నుంచి పొంగులేటి టీఆర్ఎస్ పైన కోపంగా ఉన్నట్లు పలువురు అంటున్నారు.
Ponguleti Srinivasa Reddy : పక్క రాష్ట్ర సీఎంనూ సంప్రదించిన పొంగులేటి..!
అలా పింక్ పార్టీ కి, పొంగులేటికి మధ్య గ్యాప్ రాగా, జిల్లాలో ఆధిపత్య పోరు కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొంగులేటి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పలువురు ఆరోపించారు కూడా. ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైన పరోక్షంగా పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించిన శ్రీనివాసరెడ్డి కాషాయం గూటికి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒక వేళ వస్తే కనుక టీఆర్ఎస్ బిగ్ షాక్ తగిలినట్లే.