Raj Gopal Reddy : మునుగోడులో టీఆర్‌ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలిస్తే రాజ్ గోపాల్ రెడ్డికి నిద్ర పట్టదు..!
Raj Gopal Reddy : మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం, దానిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గట్టి పట్టుంది. వీరు ఏ పార్టీలో ఉన్నా విజయం మాత్రం తథ్యం.అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అందువల్లే మునుగోడు అసెంబ్లీకి ప్రస్తుతం ఉపఎన్నిక వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఎలాగూ బీజేపీ తరఫున మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.
Raj Gopal Reddy : కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల బలమెంత?
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగితే.. ఆయన్ను ఢీకొట్టే వ్యక్తులు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అనేదే అసలు ప్రశ్న. రాజగోపాల్ రెడ్డి తన విజయం కోసం భారీగా ఖర్చుచేయగలరు. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఖర్చు చేసేందుకు సిద్ధం. మరి కాంగ్రెస్కు కంచుకోట అని చెప్పుకుంటున్న మునుగోడులో ఖర్చు పెట్టకుండానే కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడుతాయా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మిలిగింది. గతంలో జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి బలమైన అభ్యర్థిగా ఉండేవారు. కానీ 2018 ముందస్తు ఎన్నికల్లో జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆటైంలో టీఆర్ఎస్ పార్టీ భారీగా ఖర్చు చేసిందని ప్రచారం జరిగింది.డబ్బుల ముందు కాంగ్రెస్ కంచుకోట అనే సెంటిమెంట్ పనిచేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక అభ్యర్థుల విషయానికొస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌కు టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, అతనికి టికెట్ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదని నియోజక వర్గంలోని కీలక నేతలు తేల్చి చెబుతున్నారట.మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్‌కు ఐదుగురు జట్పీటీసీలు, ఐదుగురు ఎంపీపీలు, ఇద్దరు మున్సిపల్ చైర్మెన్లు ఉన్నారు.నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధుల్లో 80 శాతానికి పైగా టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు.వాళ్లలో ప్రస్తుతం కూసుకుంట్లకు మద్దతు ఇచ్చేవారు 10 శాతం మంది నేతలు కూడా లేరని తెలుస్తోంది. ఈ సీటుకోసం చాలా మంది ట్రై చేస్తున్నారని టాక్. ఇక కాంగ్రెస్ పార్టీ బీసీ అస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తోందట. అందుకే చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకుందని టాక్. రేవంత్ రెడ్డి బీసీ అస్త్రం మునుగోడులో పనిచేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.