YSRCP : రోడ్డు మీద పడ్డ వైసీపీ రాజకీయాలు.. పార్టీ పరువును బజారుకీడుస్తున్న ఆ ఎంపీ, ఎమ్మెల్యే ?
YSRCP ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో ఇద్దరు యువనేతల మధ్య పచ్చగడ్డి వేస్తే, భగ్గుమంటోంది. పార్టీకి కీలకమైన జిల్లాలో ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య తలెత్తిన విబేధాలు .. తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ యువకులే అయినా వారిద్దరి మధ్య సెట్ అవడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరూ.. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అని, వీరిద్దరి మధ్య విబేధాలు పార్టీని అధోగతి పాలుచేస్తున్నాయని కేడర్ చెబుతోంది. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి చెందింది.
దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై పట్టు కోసం అటు ఎంపీ భరత్, ఇటు రాజా ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య గట్టిపోటీ నెలకొందని తెలుస్తోంది. తాజాగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా మిత్రుడైన మాజీ సిటీ కో ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యంను కొనసాగించకుండా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను తెరమీదకు తీసుకుని రావడంలోనూ, రూరల్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆకుల వీర్రాజును తప్పించి మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించడంతోపాటు ఆయనకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించడం ద్వారా భరత్ పట్టు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే రాజా మాత్రం సమయం కోసం వేచిచూస్తున్నట్టు కనిపిస్తోంది.
3 సెగ్మెంట్లలోనూ గ్రూపులు షురూ YSRCP
ఈ నేపథ్యంలో మొత్తం 3 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. ఎంపీ భరత్ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తోపాటు రాజానగరం నియోజకవర్గంలో కూడా తన వర్గాన్ని తయారు చేసుకోవడం గమనార్హం. ఎంపీ భరత్ బీసీ, ఎస్సీల వర్గాలను దగ్గరచేసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, రాజా కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాజా గెలవడానికి ఆయన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు అన్ని వర్గాల ప్రజలతో ఉన్న సంబంధాలే కారణం. కానీ తాజాగా రాజా అనుచరులు కొందరు వైసీపీకి అండగా నిలిచిన దళితులపై దాడులు చేస్తుండడం సమస్యగా మారిందని తెలుస్తోంది.
సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేయడంతో పార్టీకే సమస్యగా మారింది. తాజాగా ఎస్టీ వర్గానికి చెందిన అధ్యాపకుడు పులుగు దీపక్‌పై కొందరు వైసీపీ నాయకులు దాడి చేయడం కూడా పార్టీకి తలనెప్పిగా మారింది. ఈ దాడులు స్థానిక ఎమ్మెల్యే రాజాకు ఇబ్బందికరంగా మారాయి. పైగా గాయపడిన అధ్యాపకుడు దీపక్‌ను ఎంపీ స్వయంగా పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇవ్వడం మరింత రచ్చ చేస్తోంది. రెండున్నర ఏళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు ఈ ఇద్దరి మధ్య విబేధాలు ఏ స్థాయికి చేరతాయనేదానిపై చర్చ జరుగుతోంది.