SBI : దెబ్బకు దిగొచ్చారు.. ఉమెన్స్ కమీషన్ మొట్టికాయలతో వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ
SBI : గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ఎస్బీఐ తాజా ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇది మహిళ పట్ల వివక్షచూపడమేకాకుండా చట్టవిరుద్ధమని, ఈ మహిళా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. దీంతో సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.అసలు ఏం జరిగింది అంటే… కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.
డిసెంబరు 31నాటి ఎస్బీఐ సర్క్యులర్ లో…. మూడు నెలల నిండిన గర్భిణీ స్త్రీలను విధిగా ఎంపిక చేసినప్పటికీ ఉద్యోగంలో చేరకుండా నిలిపివేసింది. దీని ప్రకారం నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారు. వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాఆదేశాలు జారీ చేసింది. నూతన నియామకాలకు ఈ నిబంధన 2021 డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ప్రమోషన్లపై వెళ్లేవారికి 2022 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని ఎస్బీఐ బ్యాంక్ తెలిపింది.
SBI : దెబ్బకు తగ్గారు…
అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ విషయంపై ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది.