Thummala Nageswara Rao : పొడుగు లాంటి వార్త తుమ్మల సంచలనం వెనుక కారణమేంటి.?
Thummala Nageswara Rao : తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త ట్విస్టుని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామా తాలూకు ప్రకంపనల నడుమ కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తుందన్నది నిర్వివాదాంశం. సరిగ్గా, ఈ గందరగోళం నడుమ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ‘పిడుగు లాంటి వార్త’ అంటూ కార్యకర్తల్ని కొంత హడలెత్తించారు.
ఆయన ఉద్దేశ్యం తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఏదో జరిగిపోతుందని కాదు. కానీ, కార్యకర్తలకు అలా అర్థమయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ‘పిడుగు లాంటి వార్త’ కారణంగా కంగారు పడ్డారు. మంత్రిగా వున్న సమయంలో రాష్ట్రమంతా తిరిగాననీ, ఇప్పుడు మాత్రం పాలేరు నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాననీ, కార్యకర్తలు గతంలో చేసిన పొరపాట్లు చేయకూడదని తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావుని కొంతకాలంగా టీఆర్ఎస్ అధినేత కేసీయార్ లైట్ తీసుకున్నారనే ప్రచారం జరిగిందిగానీ, ఇటీవల గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలం వెళ్ళిన కేసీయార్, తుమ్మల గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించి.. ఊహాగానాలకు తెరదించారు.
అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు చాలా మారాయి. తుమ్మలకు రాజకీయ పెత్తనం తక్కువైపోయింది. అసలాయన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఎవరూ పట్టించుకోవడంలేదన్న విమర్శ వుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ రంగంలోకి దిగి, ఆ గ్యాప్‌ని తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. తుమ్మల అనుభవాన్ని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని కేటీయార్ సూచించిన సంగతి తెలిసిందే. మరి, పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందని కార్యకర్తలతో తుమ్మల ఎందుకు అన్నారు.? ముందస్తు ఎన్నికల గురించే బహుశా తుమ్మల చెప్పి వుంటారుగానీ.. అది ఇంకోలా వెళ్ళిపోయింది తెలంగాణ సమాజంలోకి.