Sonia Gandhi : ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ: టీవీ సీరియల్‌ని తలపిస్తోందా.?
Sonia Gandhi : ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ యెదుట ఈ రోజు విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరు గంటలపాటు సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించారట. కొద్ది రోజుల క్రితమే సోనియా ఈడీ యెదుట విచారణకు హాజరు కాగా, అప్పడామెను మూడు గంటలపాటు విచారించారు. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఇంకోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా సోనియా గాంధీకి సమన్లు జారీ చేసిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి సంబంధించి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. అన్నట్టుగా, కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల్నే కాదు, సొంత పార్టీలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపైనా సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ఎంపీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణారంతరం, కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదైన సంగతి తలెసిందే. సీబీఐ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే, అప్పట్లో వైఎస్సార్ కుటుంబం ఎంతలా ఆవేదన చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడేమో, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ కేవలం ఈడీ విచారణ ఎదుర్కొంటున్నందుకే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నానా రకాల అల్లరీ చేస్తున్నాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ప్రయోగిస్తోన్న సింపతీ వ్యవహారమనీ, కాంగ్రెస్ పార్టీకి సింపతీ తెచ్చే ప్రయత్నం ద్వారా బీజేపీ ఏం లబ్ది ఆశిస్తుందో అర్థం కావడంలేదన్న అనుమానాలూ లేకపోలేదు. కాంగ్రెస్ చచ్చిన పాముతో సమానం అన్నట్టుంది పరిస్థితి. కానీ, సోనియా గాంధీ – ఈడీ – రాహుల్ గాంధీ.. ఈ ఎడతెగని సీరియల్ చూస్తోంటే అనేక అనుమానాలు కలగడం సహజమే.