Swami Swarupananda : స్వరూపానందకి కోపం రావడం వెనక ఇంత కథ ఉందా?
Swami Swarupananda : నిన్న ఏపీలో ఏం జరిగిందో తెలుసు కదా. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవ సమయంలో ఏం జరిగిందో తెలుగు రాష్ట్రాలు చూశాయి. దర్శనానికి వచ్చిన శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏపీ ప్రభుత్వంపై చాలా సీరియస్ అయ్యారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ మండిపడ్డారు. నిజానికి నిన్న చందనోత్సవ సమయంలో భక్తులు క్షేత్రానికి పోటెత్తారు.
దేవాదాయ శాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించక.. వీఐపీలు రాగానే భక్తులను ఆపేసి.. వాళ్లకు దర్శనం కల్పించడంతో భక్తులు నారసింహుడి దర్శనం కోసం గంటలకు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తులు పోలీసులు, అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి భక్తులకు కలుగుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. భక్తులను ఇబ్బంది పెడుతున్న అధికారుల తీరు చూసి తాను ఎందుకు చందనోత్సవానికి వచ్చానా అని బాధపడుతున్నా అని ఆయన తెలిపారు.
Swami Swarupananda : భక్తులను ఇంతలా ఇబ్బంది పెడతారా?
నేను జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నారు. కానీ.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భక్తులకు ఇబ్బందులు కలిగాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అంటూ స్వరూపానంద స్వామి మండిపడ్డారు. అసలు ఇంత పెద్ద దైవక్షేత్రం.. ఒక కార్యనిర్వాహక అధికారి ఉండరా? అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరైన నిర్ణయాలు లేవు. రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదు..అంటూ ఆయన మండిపడ్డారు. ఇక.. క్షేత్రానికి వచ్చిన భక్తులు కూడా ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.