YSRCP : వైసీపీకి భారీ షాక్… కీలక నేత పార్టీకి రాజీనామా
YSRCP : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణలో భారీ షాక్ తగిలింది. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే.. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో వైసీపీ పార్టీలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది.
గట్టు శ్రీకాంత్ రెడ్డికి 2007 నుంచి వైఎస్ జగన్ తో పరిచయం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వైఎస్ జగన్ తో శ్రీకాంత్ రెడ్డి సన్నిహితంగా మెలిగేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ వెంటే ఆయన నడిచారు.సీఎం జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టాక… గట్టు శ్రీకాంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రానికి వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. హుజూర్ నగర్ లో గట్టును స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగానూ జగన్ నియమించారు.
అయితే… తెలంగాణకు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ… ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పదవులు తనకు రాలేదని… తెలంగాణలో ఉన్న వైసీపీ అధ్యక్షుడిగా తనను నిర్లక్ష్యం చేశారనే ఆవేదనతోనే పార్టీని వీడుతున్నట్టు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
YSRCP : త్వరలోనే జాతీయ పార్టీలోకి వెళ్తా : గట్టు
వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గట్టు శ్రీకాంత్ రెడ్డి.. త్వరలో ఓ జాతీయ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అలాగే 2023లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు.
నా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నేను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. నా వైసీపీ పార్టీని వీడటం అనేది నా జీవితంలోనే ఒక దుర్దినం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప స్థానాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. ఒక సామాన్య కార్యకర్తను… రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్. ఇప్పటి వరకు పార్టీ ఆదేశాలను ఏనాడూ జవదాటలేదు. ఏపీ ప్రజలు జగన్ ను నమ్మారు కాబట్టే… వైసీపీని గెలిపించారు.. అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.