హోం మంత్రి సుచరిత ఎంత చెబుతున్నా వాళ్ళు వినట్లేదు – ఎన్నడూ చూడని సీన్ ఇది..!
ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్. వెలగపూడిలో జరిగిన ఘర్షణ ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఒకే సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. హోమ్ మంత్రి సుచరితతో పాటు వైసీపీ నాయకులు, ఎంపీలు అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వెలగపూడిలో ఘర్షణకు కారణమైన రోడ్డును హోంమంత్రి సుచరిత పరిశీలించి.. అక్కడి నుంచి ఘర్షణలో మృతి చెందిన మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి వెళ్తుండగా.. అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ పర్యటనలో సుచరితతో పాటు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కూడా అక్కడికి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
నందిగం సురేశ్ వస్తే మాత్రం మేం ఊరుకోం?
హోంమంత్రి సుచరిత వస్తే ఓకే కానీ.. అసలు ఈ ఘర్షణకే కారణం అయిన నందిగం సురేశ్ వస్తే మాత్రం తాము అస్సలు చూస్తూ ఊరుకోం అంటూ.. ఎంపీకి వ్యతిరేకంగా అక్కడి స్థానికులు నినాదాలు చేశారు. అలాగే.. అక్కడికి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా వచ్చారు. దీంతో అక్కడి స్థానికులు ఆమెను కూడా రాకుండా అడ్డుకున్నారు.
మేము పార్టీని చూసి జగన్ అన్నకు ఓటేశాం. కానీ.. మీరు మాత్రం మా కులాలను చూస్తున్నారు.. అంటూ అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఎంపీ, ఎమ్మెల్యే మీదికి వెళ్లబోయారు. వెంటనే పోలీసులు కల్పించుకొని అక్కడి స్థానికులను చెదరగొట్టారు.
ఈ ఘర్షణలో మృతి చెందిన మరియమ్మ కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించి.. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద 10 లక్షల పరిహారం ప్రకటించారు. కొన్ని హామీలు కూడా మంత్రి ఇవ్వడంతో వెంటనే బాధిత కుటుంబం తమ నిరసనను విరమించింది.