BRS Party : బీఆర్‌ఎస్ పార్టీ రోల్‌ ఇక లోక‌లా…? ఎస్టీడీనా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS Party : బీఆర్‌ఎస్ పార్టీ రోల్‌ ఇక లోక‌లా…? ఎస్టీడీనా…?

 Authored By aruna | The Telugu News | Updated on :4 January 2024,1:00 pm

తెలంగాణలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని, తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ మహారాష్ట్ర కలిపి కనీసం 50 ఎంపీ సీట్లు గెలవాలని, తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలని, వీలైతే ప్రధాని పీఠం అధిష్టించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత ఏడాది వరకు ఈ ఆలోచన చేశారు. తాను ప్రధాని అయితే రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతారని కలలు కన్నారు. కానీ అవేమీ నెరవేరలేదు. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఊసే ఎత్తడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. 400 కార్ల కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లి అయిదారు సభలు నిర్వహించారు. తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని, మహారాష్ట్ర కూడా బంగారు మహారాష్ట్ర చేస్తానని హామీలు ఇచ్చారు. పింఛన్లు పెంచుతామని ఇంకా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పారు.

మహారాష్ట్ర కోసం ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నారు. వివిధ పార్టీల నేతలను ప్రగతి భవన్ కి పిలిపించి చేర్చుకున్నారు. పార్టీ కార్యకలాపాల కోసం మహారాష్ట్ర ఇన్ చార్జిగా తన బంధువులు కూడా నియమించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. నాగపూర్ లో కార్యాలయం ప్రారంభానికి 400 కార్ల కాన్వాయ్ తో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ మంచి స్పందన వస్తుందని లోక సభ ఎన్నికల్లో కనీసం 20 నుంచి 30 సీట్లు గెలుస్తామని లెక్కలు కూడా చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచారని ప్రచారం కూడా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు అంతా పూర్తిగా సైలెంట్ గా ఉండిపోయారు. తెలంగాణ ఎంతో అభివృద్ధి చేశామని అక్కడ చెప్పి ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పార్టీ ఓడిపోవడంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.

మహారాష్ట్ర వాసులకు ఏం చెప్పాలో తెలియని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు చేరికలు ఆగిపోయాయి. తెలంగాణ వాసులకు తెరుచుకొని ప్రగతి భవన్ గేట్లు నాడు ఇతర రాష్ట్రాల వారికి తెరుచుకున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేశారు. దీంతో మహారాష్ట్ర నేతలు ఇటువైపు కూడా చూడడం లేదు. కేసీఆర్ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఇక త్వరలోనే లోక సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందని బీజేపి నేతలు చెబుతున్నారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ సమాయత్తం అవుతున్నాయి. తమది కూడా జాతీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ మహారాష్ట్ర పై చేతులు ఎత్తేసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ పోటీ చేసిన ఓడిపోతే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది