Health Tips | ఎముకలను బలహీనపరచే ఆహారాలు ఇవే.. వాటిపట్ల జాగ్రత్తగా ఉండండి!
Health Tips | శరీర ఆరోగ్యానికి కాల్షియం ఎంతో ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచడమే కాకుండా రక్తపోటు నియంత్రణ, కండరాల కదలికలు, కణాల పనితీరులో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే కొన్ని ఆహారాలు కాల్షియం శోషణను తగ్గించి ఎముకలను బలహీనపరుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
#image_title
శీతల పానీయాలు (సోడా)
నేటి కాలంలో చిన్నా పెద్దా అందరూ సోడా పానీయాలు ఇష్టంగా తాగుతారు. కానీ ఇవి ఎముకల శత్రువులుగా మారతాయి. వీటిలో ఉండే ఫాస్ఫోరిక్ ఆమ్లం శరీరంలో కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. ఫలితంగా ఎముకలు క్రమంగా బలహీనపడతాయి.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం
మేక మటన్, సాసేజ్, బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఇది ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపి కాల్షియం శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.
తీపి పదార్థాలు – కేకులు, క్యాండీలు, కుకీలు
బేకరీ ఆహారాలు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను కలిగించి కాల్షియం శోషణను అడ్డుకుంటాయి. దీని ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించడం అవసరం.
టీ, కాఫీ
టీలో, కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో కాల్షియం నిల్వలను తగ్గిస్తుంది. రోజుకు ఎక్కువ కప్పులు తాగడం వల్ల ఎముకలు త్వరగా నాజూకుగా మారతాయి. వీటికి బదులుగా పాలు, మజ్జిగ లేదా కాల్షియం అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం మంచిది.
ఆల్కహాల్
మద్యం సేవించడం వల్ల శరీరంలోని కాల్షియం స్థాయిలు పడిపోతాయి. ఇది ఎముకల దృఢత్వాన్ని తగ్గించి ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. బలమైన ఎముకల కోసం మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
నూనె పదార్థాలు
సమోసాలు, బజ్జీలు, వేయించిన చికెన్ వంటి నూనె పదార్థాలు రుచిగా ఉన్నా, ఇవి శరీరంలో వాపు, మంటలకు కారణమవుతాయి. దీనివల్ల కాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి నూనె ఆహారాల బదులుగా తేలికపాటి, ప్రోటీన్ మరియు కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.