TRS : ఇది ఎవ్వరూ ఊహించనిది..? హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ పార్టీకి కీలక నేతల గుడ్ బై..?
ఖమ్మం: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అధికార పార్టీ నేతల కదలికలను బట్టి.. త్వరలో కారుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ ఆపరేషన్ అనుకున్నదానికంటే సక్సెస్ అవుతుందని, త్వరలోనే కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారని గాంధీభవన్ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నారు. విప్లవాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలుపెట్టారట.
రేవంత్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో .. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లాను శాసించిన తుమ్మల నాగేశ్వర్‌రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయిన తుమ్మల నాగేశ్వర్‌రావు పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో మరింత బలహీనమయ్యారు. జిల్లాలో అధికారపార్టీ పై అసమ్మతి పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కనిపించడంతో.. తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వర్‌రావుతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపగా, తుమ్మల నాగేశ్వర్‌రావు అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా తుమ్మల నాగేశ్వర్‌రావు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
ఓటమితో సైలెంట్.. TRS
టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మంలో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్‌రావు పువ్వాడ అజయ్ పై ఓడిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పట్టున్న తుమ్మల నాగేశ్వర్‌రావును టీఆర్ఎస్‌లోకి పిలిచి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని అప్పజెప్పారు. అనంతరం మంత్రిగా జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక పాత్రపోషిస్తూ జిల్లాకు సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులు తెచ్చిపెట్టారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు.
అయితే 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా కారు హవా వీచినా.. పాలేరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తరువాత పార్టీలో కూడా తన స్థాయికి తగ్గ గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మళ్ళీ పాలేరు నుండి నిలబడ్డ తుమ్మల నాగేశ్వర్‌రావు ఓటమి పాలవడం నాటినుంచి నేటి వరకు సరైన గుర్తింపు లేకపోవడంతో తుమ్మల నాగేశ్వర్‌రావు పార్టీ మారుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ లో చేరితో ఖమ్మం జిల్లాలో కారు స్పీడ్ కు బ్రేకులు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.