Rasamayi: నాలాంటోడు మౌనంగా ఉండటం క్యాన్సర్ కన్నా ప్రమాదం.. ఏంటి రసమయి రూట్ మార్చారు?
రసమయి బాలకిషన్ తెలుసు కదా. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ముందుండి కేసీఆర్ తో పాటు నడిచారు. కేసీఆర్ తో పాటు పోరాడారు. ధూంధాం కార్యక్రమంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో రసమయికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆయన మానకొండూరు నుంచి గెలిచి చూపించారు. ఆ తర్వాత 2018 లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో కూడా తన పాటలతో ఉత్తేజపరిచేవారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను, సీఎం కేసీఆర్ ను తన పాటలతో ప్రశంసించేవారు. అంతలా టీఆర్ఎస్ పార్టీతో అటాచ్ మెంట్ ఏర్పరుచుకున్న రసమయి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది.
మొదటి నుంచి కేటీఆర్ కంటే హరీశ్ రావుతోనే సాన్నిహిత్యం
రసమయి బాలకిషన్ కు మొదటి నుంచి మంత్రి కేటీఆర్ కన్నా… హరీశ్ రావుతోనే సాన్నిహిత్యం ఎక్కువ. అప్పుడు అంతే.. ఇప్పుడూ అంతే. మరోవైపు తన సొంత జిల్లా కరీంనగర్ లో మాత్రం.. మంత్రి ఈటలకు అనుచరుడిగా ఉంటున్నారు రసమయి. దీనివల్ల… మరో మంత్రి గంగుల కమలాకర్ కు, రసమయికి పడటం లేదట. గంగులతో కన్నా… ఈటలతోనే రసమయి అటాచ్ మెంట్ ఏర్పరుచుకోవడంతో గంగులకు అది నచ్చడం లేదట.
అలాగే.. మంత్రి కేటీఆర్ వర్గానికి చెందిన నేతల వల్ల కూడా బాలకిషన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. తాను మానకొండూరు ఎమ్మెల్యే అయినప్పటికీ… తన నియోజకవర్గంలో వేరే నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని.. తన సన్నిహితుల వద్ద రసమయి కన్నీటి పర్యంతం అయారట.
అయితే.. తాజాగా టీఆర్ఎస్ పార్టీపై తనకు ఉన్న అసంతృప్తి మరోసారి బయటపడింది. ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభకు మహబూబాబాద్ కు హాజరయిన రసమయి… టీఆర్ఎస్ పార్టీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండటం వల్ల.. నా సహజత్వాన్నే కోల్పోయాను. నేనొక లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా. నా నోరు కట్టేశారు. నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం వల్ల.. నేను చాలామందికి దూరమయిపోయాను. ఈ సమాజంలో కవులు కానీ.. కళాకారులు కానీ.. మౌనంగా ఉన్నారంటే.. అది క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరం.. అంటూ రసమయి.. షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.