TRS Party : సమర్థతే లింగయ్య బలం, ఆ బలమే కెసిఆర్ నమ్మకం…!
TRS Party : తెలంగాణాలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణా సిఎం కేసీఆర్ పార్టీకి కొత్త జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. నేడు ఉదయం దీనికి సంబంధించి తెరాస పార్టీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. పార్టీ విధేయులు, కీలక నాయకులు, సమర్ధులైన ఎంపీల మీద దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ లతో పాటుగా ఎంపీలకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది.
సూర్యాపేట జిల్లాకు గాను రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను అధ్యక్షుడిగా ప్రకటించింది. 1982 లో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన లింగయ్య యాదవ్… బీసీల్లో బలమైన నేతగా ఎదిగారు. యాదవ సామాజిక వర్గంలో ఎందరో కీలక నేతలు ఉన్నా సరే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తొలుత ఎంపీటీసీగా రాజకీయాల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన… టీడీపీలో కూడా పలు కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా పదేళ్ళ పాటు పని చేసారు.
ఆ తర్వాత నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 12 ఏళ్ళ ఆయన సేవలు అందించారు. గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. 2015 లో టీడీపీ ని వీడి సిఎం కేసీఆర్ పై నమ్మకంతో టీఆర్ఎస్ లోకి అడుగు పెట్టారు. సమర్ధవంతంగా ఇచ్చిన బాధ్యతలను నిర్వహించడంతో ఆయనను 2018 లో రాజ్యసభకు పంపించారు సిఎం కేసీఆర్. ఉన్నత విద్యావంతుడు కావడం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నేత కావడంతో సిఎం కేసీఆర్ కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు.
రాజ్యసభకు వెళ్ళినా సరే ప్రజల్లోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. స్థానిక నేతలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. ఇక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో నిత్యం టచ్ లో ఉండటం సమస్యల పరిష్కారానికి అడుగులు వేయడంతో సిఎం కేసీఆర్ కు మరింత దగ్గరయ్యారు. ఇక యాదవ సామాజిక వర్గంలో జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండటంతో నేడు ఆయనను సూర్యాపేట జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచిన కేసీఆర్ కు, మంత్రి కేటిఆర్ , మంత్రి జగదీశ్ రెడ్డి కు బడుగుల లింగయ్య యాదవ్ ధన్యవాదాలు చెప్పారు.