Pawan Kalyan VS Perni Nani : “భీమ్లానాయక్” నష్టాలకు కారణం జగన్ ప్రభుత్వమే.. పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ వీడియో వైరల్..!!
Pawan Kalyan VS Perni Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్… అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి గోదావరి జిల్లాలలో పర్యటించడం తెలిసిందే. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు ఇంకా పొత్తుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాకపోతే తనని ఎవరు టార్గెట్ చేసేవారు కాదని పవన్ అన్నారు. “భీమ్లానాయక్” సినిమాని కక్షకట్టి ఆపేసి 30 కోట్లు నష్టం వచ్చేలా చేశారని విమర్శలు చేశారు.
అయినా సమాజం పై ఉన్న ప్రేమతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేతిలో మోసపోవటానికి నేనేమైనా చిన్న పిల్లవాడినా అని అన్నారు. ఒక మొక్క వృక్షం అవటానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది. అటువంటిది.. రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా రావడం అంటే మామూలు విషయం కాదు ప్రకృతి పరంగా అణిచివేయటం సహజం అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కాపులను పవన్ మరియు చంద్రబాబు కలిసి దగా మోసం చేశారని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు.
“భీమ్లానాయక్” సినిమాకి కావాలని నష్టం వచ్చేలా ప్రభుత్వం చేసిందని పవన్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఖండించారు. సినిమా రంగంలో చిరంజీవి తమ్ముడిగా వచ్చి ఆయన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు ఇది చాలా దారుణం అంటూ పవన్ పై పేర్ని నాని సెటైర్లు వేశారు. అసలు పవన్ కళ్యాణ్ కి 100 కోట్లు మార్కెట్ లేదు 30 కోట్ల రూపాయలు ఎలా నష్టం వస్తాయి అంటూ పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. సినిమా బాగోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది.. బస్సులు పెట్టి జనాలని థియేటర్ కి తరలించాలా అని ప్రశ్నించారు. చిరంజీవి తీసిన “వాల్తేరు వీరయ్య” లాగా కంటెంట్ ఉంటే నిర్మాతలకి లాభాలు వస్తాయి అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.