Jayasudha : జయసుధ బీజేపీలో చేరుతున్నారా.? ఏది నిజం.?
Jayasudha : సినీ నటి జయసుధ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, 2014 తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. జయసుధ రాజకీయాల్లోకి రావడం వెనుక అనేక ‘ఈక్వేషన్స్’ పని చేశాయి. అందులో మతపరమైన ఈక్వేషన్స్ కూడా వున్నాయంటారు చాలామంది. ఇప్పుడు, అవే ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆమెతో భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరుపుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీలో చేరాలంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జయసుధను కోరారట. అయితే, ఈ విషయమై జయసుధ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.
ఈ నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో అధికారికంగా చేరేది ఆ రోజే. అదే రోజున జయసుధ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయమై జయసుధ పెదవి విప్పారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశ్యం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 21న బీజేపీలో చేరడంలేదని కూడా స్పష్టతనిచ్చారామె. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినా, బీజేపీ నుంచి ‘మంచి పదవి’ని ఆఫర్ చేస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారట జయసుధ. ఆ పదవి ఎలాంటిది.? అన్నదానిపై బీజేపీ ముందు ఇప్పటికే జయసుధ కొన్ని ప్రతిపాదనలు పెట్టారట కూడా. కానీ, ఈ విషయమై బీజేపీ శ్రేణులు పెదవి విప్పడంలేదు.
జయసుధ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీజేపీకి ఎంతో కొంత ప్లస్ అవుతుందని బీజేపీలో కొందరు నేతలు భావిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచే ఆమెతో పోటీ చేయించాలన్నది చాలామంది ఆలోచనగా కనిపిస్తోంది. కానీ, ఎన్నికల్లో పోటీపై జయసుధ అంత ఆసక్తితో లేరట. నామినేటెడ్ పదవుల గురించే ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడైనా ఎలాగైనా మారిపోవచ్చు. నిప్పు లేకుండా పొగ రాదేమోగానీ, రాజకీయాల్లో నిప్పు లేకుండా పొగ వచ్చేస్తుంటుంది. మరి, జయసుధ విషయంలో ఏం జరగబోతోంది.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!