Vijaya Sai Reddy : కేంద్రంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపాటు.! అలా కడిగెయ్యాల్సిందే.!
Vijaya Sai Reddy : ఇదే, ఇలాంటి ఫైర్ కావాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కేంద్రం తీరుపైన. పోలవరం ప్రాజెక్టు విషయంలో కావొచ్చు, రాజధాని విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సరిగ్గా సహకరించడం లేదు. అయినాగానీ, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు సక్రమంగా వుండాలన్న కోణంలో వైసీపీ సంయమనం పాటిస్తోంటే, దాన్ని అలుసుగా తీసుకుంటోంది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. కేంద్రం వేరు, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ వేరు..
అంటూ కమలనాథులు ఎప్పటికప్పుడు వింత వాదనను తెరపైకి తెస్తూ, రాజకీయ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయానికొస్తే, కేంద్రానిది ఓ వైఖరి, బీజేపీది ఇంకో వైఖరి. ఇదొక్కటే కాదు, అన్ని విషయాల్లోనూ అంతే. ప్రత్యేక హోదా ఇవ్వరు, రైల్వే జోన్ సంగతి తేల్చరు. రాష్ట్రానికి లోటు బడ్జెట్టుని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రం మీద వున్నా, అదీ సరిగ్గా చేయడంలేదు కేంద్రం.
ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఇంకా ఉపేక్షించడం తగదన్న కోణంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, లెక్కలతో సహా కేంద్రం తీరుని ఎండగట్టేశారు. కేంద్రం, రాష్ట్రాలకు 41 శాతం పన్నుల వాటా ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నా, అందులో నిజం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. సెస్, ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోన్న కేంద్రం, తదనుగుణంగా రాష్ట్రాలకు వాటాలు ఇవ్వడంలేదని విజయసాయిరెడ్డి నిలదీశారు.