CM Ys Jagan : ఆ ఒక్క తప్పు.. సీఎం వైఎస్ జగన్ డేంజర్‌లో పడినట్లేనా..?
CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీల్ గుడ్ పాలన అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అందరికీ ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నారు. అడిగిన వెంటనే ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వండర్స్ చేస్తున్నారు. ఒక రకంగా ఏపీలో నవ శకానికి నాంది పలుకుతున్నారని చెప్పొచ్చు. అయితే ఆకాశంలోని అంత అందమైన చంద్రుడికి కూడా చిన్న మచ్చ ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకి సైతం ప్రజల నుంచి ఒక రిమార్క్ వస్తోంది. నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలను స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతోందంటూ జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహమ్మారి ఒక కారణం..
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కరోనా వైరస్ రెండు సార్లు వ్యాప్తి చెందింది. దీంతో ఏపీలో గతేడాది లాక్డౌన్ పెట్టగా ఈసారి కర్ఫ్యూతో కానిస్తున్నారు. లాక్డౌన్, కర్ఫ్యూల కారణంగా రవాణా, ఉత్పత్తి తదితర అన్ని రంగాలు ప్రభావితమవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ వల్ల నిత్యావసరాల రేట్లు రెట్టింపు అయ్యాయి. కాబట్టి ఈ విషయంలో పూర్తి వైఫల్యాన్ని గవర్నమెంట్ పైనే వేయకూడదు. కానీ ప్రజలు ప్రభుత్వాన్ని తప్ప మరెవర్ని నిందించగలరు?. ఇదే అదునుగా ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. అన్ని ధరల సంగతి పక్కన పెట్టినా కనీసం పెట్రోల్ రేటునైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త తగ్గించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్నే తప్పుపట్టకుండా తానూ నష్టనివారణ చర్యలు తీసుకోవాలి అంటూ ఏపీ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాయి.
ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో.. : CM Ys Jagan
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతికి ఎముకే లేదన్నట్లుగా అడిగినా అడక్కపోయినా అందరికీ అన్నీ ఇస్తున్నారు. కరెక్ట్ టయానికి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. అయితే ఆ ఆనందం ప్రజలకు ఎక్కువ సేపు ఉండట్లేదు. నిత్యవసర సరుకుల కోసం షాపుకెళితే పెరిగిన ధరలతో జేబు ఖాళీ అవుతోంది. ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్లు ఉందని పబ్లిక్ వాపోతున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి గానీ ఈ ఒక్కటే తేడా కొడుతోందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ సర్కారు ఈ దిశగా కూడా ఫోకస్ పెడితే ఇక తిరుగుండదు.