Ys Vijayamma : ఇద్దరి మధ్య నలిగిపోతున్న వైఎస్ విజయమ్మ..!
Ys Vijayamma : వైఎస్ విజయమ్మకి ఊహించని కష్టం వచ్చిపడింది. దివంగత ముఖ్యమంత్రికి సతీమణి, ప్రస్తుత ముఖ్యమంత్రికి తల్లి, కాబోయే ముఖ్యమంత్రి(?)కి కూడా మాతృమూర్తి అయిన వైఎస్ విజయమ్మ సాధారణ ఇల్లాలి మాదిరిగా సంకట స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు(ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి), కూతురు వైఎస్ షర్మిలా రెడ్డి మధ్య వైఎస్ విజయమ్మ నలిగిపోతున్నట్లు సమాచారం. తన ఇద్దరు బిడ్డల్లో ఎవరికేం చెప్పాలో తెలియని సందిగ్ధంలో వైఎస్ విజయమ్మ ఇబ్బందిపడుతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైఎస్ విజయమ్మకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకున్నారా అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆ ఆనందం.. ఆవిరి..
కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటికొచ్చి, ఏపీకి సమర్థుడైన ప్రతిపక్ష నేతగా నిరూపించుకొని, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఓ తల్లిగా వైఎస్ విజయమ్మ ఎంతో మురిసిపోయి ఉంటారు. కానీ ఆ ఆనందం వైఎస్ విజయమ్మకు ఎక్కువ రోజులు నిలవలేదు. వైఎస్ జగన్ కి, వైఎస్ షర్మిలకి మధ్య రాజకీయంగా భేదాభిప్రాయాలు తలెత్తాయి. వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సొంతగా పార్టీ పెడతానంటే అన్న వైఎస్ జగన్ సున్నితంగా వద్దన్నాడు. అయినా వైఎస్ షర్మిల వినలేదు. అలిగి అమెరికా వెళ్లింది. పులివెందులలో ప్రతి సంవత్సరం తమ కుటుంబం మొత్తం హాజరయ్యే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఆ ఫ్యామిలీలో అన్నాచెల్లెలికి మధ్య పడట్లేదు అనే ప్రచారం మొదలైంది.
చివరికి అదే నిజమైంది.. : Ys Vijayamma
వైఎస్ షర్మిల తన అన్న జగనన్న, అమ్మ విజయమ్మ మాటలను కూడా కాదని తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోందంటూ ఎల్లో మీడియా కోడై కూసింది. అయితే అదంతా అబద్ధం అని చెప్పటానికి, ఈ మేరకు వైఎస్ షర్మిలతో ఒక ప్రకటన జారీ చేయించటానికి వైఎస్ విజయమ్మ చాలా కష్టపడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తానికి అనుకున్నదే అయింది. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతో వైఎస్ విజయమ్మకు అష్టకష్టాలు మొదలయ్యాయి.
పేరు దగ్గర పేచీ..
వైఎస్ జగన్ కి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టనుండటంతో ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో కుమార్తెకు సపోర్టుగా నిలవాల్సి వచ్చింది. అయితే వైఎస్ షర్మిల తన పార్టీ పేరును వైఎస్సార్టీపీ(వైఎస్సార్ తెలంగాణ పార్టీ)గా నమోదు చేయించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చంటూ కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో వైఎస్ విజయమ్మ వైఎస్సార్సీపీని పోలిన పేరు(వైఎస్సార్టీపీ) పెట్టుకున్నా తమకు అబ్జెక్షన్ లేదంటూ లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అలా లెటర్ రాయటం ఏంటి అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లిని గట్టిగా అడిగినట్లు ఆ నోటా ఈ నోటా చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ నిలదీసినట్లుగా అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం ఒక తల్లిగా వైఎస్ విజయమ్మకు కొంచెం కష్టమే కదా.