Ysrcp : ఇన్నాళ్లకు వాళ్ల దశ తిరుగుతోంది..!
Ysrcp : ఓపిక పట్టినోడికి ఓరుగల్లు పట్నమని పెద్దలు చెబుతుంటారు. వైఎస్సార్సీపీలో చాలా మందికి ఈ సామెత వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్లు పదేళ్లకు పైగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. పదవులను ఆశించినా, అవి వరించకున్నా నిరుత్సాహానికి గురికాకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు. విశ్వసనీయతకి మారుపేరుగా చెప్పుకునే వైఎస్ ఫ్యామిలీ పైన నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అన్యాయం చేయడనే ప్రగాఢ విశ్వాసం ప్రదర్శించారు. విధేయతతో మసలుకున్నారు. అలాంటి వాళ్లకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు వాళ్లకు కాలం కలిసొచ్చింది. ఎమ్మెల్సీల రూపంలో రాజయోగం పట్టనుంది.
ఎన్ని ఖాళీలు?..
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలు, గవర్నర్ కోటాలో 4 సీట్లు, ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ పదవులు మొత్తం 18 పదవులు ఖాళీ అవుతున్నాయి. ఆల్రెడీ గవర్నర్ కోటాలో నలుగురిని ఈ పోస్టులకు ఎంపిక చేసి పంపగా విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ నలుగురిలో లేళ్ల అప్పిరెడ్డి ఒకరు. ఆయన గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు. వైఎస్ జగన్ కి వీరవిధేయుడిగా పేరొందాడు. ఫలితాన్ని ఆశించకుండా పార్టీ కోసం పని చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి శ్రమ ఎట్టకేలకు ఫలించింది. వైఎస్సార్సీపీలో ఆయన కథ చివరికి సుఖాంతం అయింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కి సైతం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ దాన్ని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆలస్యమవుతుంది తప్ప.. : Ysrcp
తన పైన భరోసాతో దశాబ్ద కాలానికి పైగా వైఎస్సార్సీపీని ముందుకు తీసుకెళుతున్న విశాఖ సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ యాదవ్ కి కూడా ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని చెబుతున్నారు. దీంతో వంశీకృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నా ఓటమి భయం లేకుండా డైరెక్టుగా శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నాడు. ఆరేళ్ల పాటు ఆరాంగా పదవిని అనుభవించనున్నాడు. ఈ నియామకాల ద్వారా వైఎస్ జగన్ తన పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపుతున్నారు. నో ఫియర్.. ఐయామ్ హియర్.. అంటూ ధైర్యం చెబుతున్నారు. ప్రతిఒక్క నాయకుడి పనితీరును, త్యాగాన్ని తాను మర్చిపోనని, ఆలస్యమైనా ఆశాభంగం కాకుండా తోడుగా ఉంటానని అభయమిస్తున్నారు.