YS Sharmila : స్వాతంత్ర దినోత్సవం నాడు పోలీస్ స్టేషన్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై వైఎస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!
YS Sharmila : స్వాతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదు ఎల్బీనగర్ పోలీసులు మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చాలామంది ప్రముఖ మహిళా నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడటం జరిగింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయగా తర్వాత ఎస్సై రవికుమార్ అనే అధికారిని పోలీస్ కంట్రోల్ రూమ్ కి బదిలీ చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సైతం ఈ ఘటన పై తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది.
తాజాగా ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో బాధితురాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడి పోలీసులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. “గిరిజన మహిళ లక్ష్మి విషయంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరిస్తే కేసీఆర్ ఏం చర్యలు తీసుకున్నారు?రోడ్డు మీద తిరిగే రౌడీలకు పోలీసులకు ఏం తేడా ఉంది? అసలు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా? ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు..
ఇంత వరకు బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు.ఇంత దారుణానికి పాల్పడ్డ ఎస్సైని బదిలీ చేస్తే బాధితురాలికి న్యాయం జరిగినట్టా? ఈ ఘటనకు కారకులైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలి. పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలి. బాధితురాలికి రూ.25 లక్షల నష్టపరిహారంతో పాటు 120 గజాల భూమి ఇస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం”.. అని వైయస్ షర్మిల ట్విటర్లో స్పందించారు.