YSRCP : వైసీపీని గుడ్డిగా నమ్ముకుంటే ఇంతేనా.. ఆ సీనియర్ నేత తీవ్ర అసంతృప్తి..?
YSRCP : వైఎస్సార్సీపీ పార్టీ ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది. 2014 ఎన్నికల్లో ఏపీలో గెలవడం కోసం ఈ పార్టీ ఎంతో కష్టపడింది కానీ.. గెలవలేకపోయింది. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది వైసీపీ పార్టీ. మొదటి నుంచి తన పార్టీలోని నాయకులకు సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందుకే.. వైసీపీ పార్టీ బలంగా మారింది. పార్టీలో అప్పట్లో ఎటువంటి అంతర్గత విభేదాలు ఉండేవి కావు. కానీ.. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి పార్టీలో కూడా కొన్ని సమస్యలు ప్రారంభం అయ్యాయి. నేతల మధ్య విభేదాలు రావడం.. ఒకరిపై మరొకరు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం.. ఇలా నేతల మధ్య దూరం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
దీని వల్ల కొందరు సీనియర్ నేతలు, పార్టీని నమ్మకున్న నేతలు.. అడ్డంగా బుక్కయిపోతున్నారు. వాళ్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ కోసం ప్రాణం పెట్టి మరీ పనిచేస్తుంటే వాళ్లపై ఫిర్యాదులు చేస్తున్నారు మరికొందరు. తమ సొంత నియోజకవర్గాల్లోనే గ్రూపులు, వర్గాలుగా విడిపోయి.. నువ్వా..నేనా అంటూ గొడవకు దిగి కొందరు పార్టీ పేరును కూడా బజారుకీడ్చుతున్నారు. అయితే.. మొదటి నుంచి సీఎం జగన్ ను నమ్ముకున్న ఓ సీనియర్ నేత ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన ఏం చేయలేకపోతున్నారట. ఆయన్ను పొమ్మనకుండా పొగబెడుతున్నారు.. అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు అంటే కడప జిల్లా రాజంపేట వైసీపీ సీనియర్ నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి. రాజంపేట ప్రస్తుత ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డికి, అమర్ నాథ్ రెడ్డికి అస్సలు పడటం లేదు.
YSRCP : సీఎం జగన్ కూడా అమర్ నాథ్ రెడ్డిని పట్టించుకోవడం లేదా?
అయితే.. సీఎం జగన్ కూడా అమర్ నాథ్ రెడ్డిని పట్టించుకోవడం లేదు అనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా అమర్ నాథ్ రెడ్డికి జగన్ ఎటువంటి పని అప్పజెప్పలేదట. తన నియోజకవర్గంలో తన పలుకుబడి నడవడం లేదని.. రాజంపేటలో మల్లికార్జున రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా.. హైకమాండ్ కూడా గప్ చుప్ గా ఉంటుండటంతో… సీఎం జగన్ ఎందుకు సీనియర్ నేతల విషయంలో ఇలా మొండిగా వ్యవహరిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.