Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం ఎన్నిక..!
Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటన చేశారు.. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది.
Ayyannapatrudu అయ్యన్నకి స్పీకర్ పదవి..
చంద్రబాబు… స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో ఉన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారన్న చంద్రబాబు…. విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉన్నారు.
1983లో తొలిసారిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగానూ పనిచేసిన అయ్యన్నపాత్రుడు.. స్పీకర్ పదవిని అలంకరించారు.ఇప్పడు స్పీకర్ పదవితో ఆయన యాక్టివ్ రాజకీయాలకి దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్రకే చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా వ్యవహరించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడికే స్పీకర్ ఛైర్ దక్కడం విశేషం