Bhatti Vikramarka : వాళ్లకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేం.. క్లారిటీ ఇచ్చిన భట్టి, కోమటిరెడ్డి?
Bhatti Vikramarka : ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొన్నది. తెలంగాణలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎలాగైనా తెలంగాణ గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అయితే.. ఎన్నికలకు మూడు నెలల ముందే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దీంతో భారీ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా చాలా యాక్టివ్ అయింది. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు భారీ స్థాయిలో దరఖాస్తులు కూడా వచ్చాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Bhatti Vikramarka : తొలి జాబితాలో టికెట్ రాకపోయినా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో టికెట్ రాకపోయినా కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని కోమటిరెడ్డి కూడా తెలిపారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఒక కొలిక్కి వచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.