Telangana Budget 2024 : వ్యవసాయానికే పెద్దపీట వేశామన్న భట్టి .. దేశ చరిత్రలో ఇది మైలు రాయి అని కామెంట్..!
ప్రధానాంశాలు:
Telangana Budget 2024 : వ్యవసాయానికే పెద్దపీట వేశామన్న భట్టి .. దేశ చరిత్రలో ఇది మైలు రాయి అని కామెంట్..!
Telangana Budget 2024 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, మొత్తం బడ్జెట్ రూ.2,91,159 లక్షల కోట్లు కాగా.. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. మొత్తం రూ.72,659 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. సంక్షేమానికి కూడా రూ. 40 వేల కోట్లు కేటాయించారు.నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో భట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు.
Telangana Budget 2024 వ్యవసాయానికి సింహభాగం..
రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్ అని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.72.659 కోట్లు.. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు. అలాగే ఉద్యానవనం రూ.737 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,980 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేకూర్చేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు.
సన్నరకం వరిసాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని.. అవి పండించిన రైతులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ‘రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తాం. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం చేస్తాం. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నాం.’ అని భట్టి పేర్కొన్నారు. పీఎం ఫసల్ భీమా యోజనాలో చేరాలని నిర్ణయించాం. రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో పంట లక్ష్యంగా పెట్టుకున్నాం అని భట్టి తెలిపారు.