TDP : టీడీపీ గెలిస్తే వాలంటీర్ల జీతాలు పెంచుతాం..? వామ్మో ఇదేమి ప్రకటన
TDP : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయినా వెంటనే ప్రవేశ పెట్టిన పధకం వాలంటీర్ల వ్యవస్థ, గ్రామాల్లో ప్రభుత్వ పధకాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ లెక్కన జగన్ ఈ పధకాన్ని ప్రవేశ పెట్టి వాళ్ళకి నెల నెల ఐదు వేల వరకు గౌరవ వేతనం ఇస్తున్నాడు. జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని అందరి కంటే ఎక్కవుగా టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. వారు వైసీపీ కార్యకర్తలని.. ఎన్నికల కోసం.. వారిని వాడుకుంటున్నారని వైసీపీకి ఓటు వేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ విధంగా విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు, టీడీపీ గెలిస్తే మాత్రం వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ కి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ ప్రకటన చేశాడు. అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను పెంచుతామని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సౌకర్యాలను కల్పిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.
ఎదో విజయవాడ మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ఆ కోణంలో ఆయన ఆ ప్రకటన చేశాడు అనుకుంటే పొరపాటే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ చెప్పటం జరిగింది. సరే అధికారంలోకి రావటం, రాకపోవటం తర్వాతి విషయం, టీడీపీ వ్యతిరేకించే వాలంటీర్లకు ఆ పార్టీ అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని నాని చెప్పటం హాట్ టాపిక్ అవుతుంది.
అయితే కేశినేని నాని ఈ ప్రకటన చేయటం వెనుక గట్టి ఆలోచనే ఉన్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా వాలంటీర్లు తమకు జీతాలు సరిపోవటం లేదని, వాటిని పెంచాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే, అయితే జగన్ మాత్రం జీతాలు పెంచే ఆలోచన లేదని, మీరు చేస్తుంది ఒక ప్రజా సేవ, మీకు ఇస్తుంది గౌరవ వేతనం తప్పితే, జీతం కాదు. కాబట్టి చేస్తున్న సేవకు సన్మానాలు లాంటివి చేస్తాం కానీ వేతనం పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. దీనితో వాలంటీర్లు కు జగన్ పట్ల కొంచం వ్యతిరేకత వచ్చింది.
దానిని గమనించిన నాని తమ పార్టీ అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని చెప్పటం ద్వారా కనీసం వాలంటీర్ల లో ఒక పది శాతం మంది టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే చాలు అనేది నాని ఆలోచన అని తెలుస్తుంది. వాలంటీర్లు అంటేనే వైసీపీ నేతలు అనేది అందరికి తెలిసిన విషయాం. అలాంటి వాళ్ళే టీడీపీ కి ఓట్లు వేయమని తమకు అప్పగించిన 50 ఇళ్లల్లో చెపితే ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందుకే నాని జీతాలు పెంపు అనే మాటను వదిలాడు అని తెలుస్తుంది.