Jamili Elections : జమిలి ఎన్నికలు సాధ్యమా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!
ప్రధానాంశాలు:
Jamili Elections : జమిలి ఎన్నికలు సాధ్యమా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది.ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ తన విస్తృతమైన 18,626 పేజీల నివేదికను మార్చి 2024లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టుల నుండి పన్నెండు మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌లతో సహా న్యాయ నిపుణులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Jamili Elections సాధ్యం అవుతుందా ?
ఈ చర్చల్లో భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ మొత్తం 62 పార్టీల అభిప్రాయాన్ని కోరింది. ఇందులో 47 పార్టీలు మాత్రమే రియాక్టు అయ్యాయి. 15 రాజకీయ పార్టీలు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.జమిలి ఎన్నికలకు ఓకే చెప్పి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు ఇవే – ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అప్నాదళ్ (సోనేలాల్), అసోం గణ పరిషత్, బిజూ జనతాదళ్, లోక్ జన్ శక్తి , మిజో నేషనల్ ఫ్రంట్ ,ఎన్ డీపీపీ , శివసేన, జేడీయూ , సిక్కిం క్రాంతికారీ పార్టీ , శిరోమణి అకాలీదళ్ ,యూపీపీఎల్ ఈ పార్టీలు మద్దతు ఇస్తే.. మరికొన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. అలా వ్యతిరేకించే పార్టీల్ని చూస్తే..
ఏఐయూడీఎఫ్, టీఎంసీ (మమతా బెనర్జీ పార్టీ) ,ఏఐఎంఐఎం (మజ్లిస్) , సీపీఐ ,డీఎంకే , నాగా పీపుల్స్ ఫ్రంట్ ,సమాజ్ వాదీ పార్టీతో పాటు మరికొన్ని వ్యతిరేకించాయి జమిలి మీద ఎలాంటి స్పందన తెలియజేయని పార్టీలు కూడా ఉండగా, ఇందులో తెలుగు రాష్ట్రాల్లో అధికార.. విపక్షాలుగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు ఈ కోవలోకి ఉండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఐయూఎంల్ ,ఎన్ సీ ,జేడీఎస్ , జేఎంఎం, కేరళ కాంగ్రెస్ , ఎన్సీపీ ,ఆర్జేడీ , రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, ఆర్ ఎస్పీ – ఎస్డీఎఫ్ తదితర పార్టీలు ఉన్నాయి.