KCR : జగన్ చెక్ పెట్టటానికి కేసీఆర్ వ్యూహం.. ఇదేమి రాజకీయం దొర
KCR రాజకీయంగా ఎత్తుగడలు వేయటంలో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి. తనకు అనుకూలంగా ఉన్నన్ని రోజులు ఆయా నేతలను గొప్పగా చూసుకునే కేసీఆర్, తనకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిసిన మరుక్షణం వాళ్లకు చెక్ పెట్టె విధంగా పావులు కదపటంలో సిద్ధహస్తుడు. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగా తెలంగాణ తెరాస నేతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాడు.
ఇక్కడ గమనిస్తే అసలు జలాలతో ఎలాంటి సంబంధం లేని తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ విషయంలో జగన్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. వైఎస్ దొంగ అయితే, ఆయన కొడుకు గజ దొంగ అంటూ దారుణమైన ఆరోపణలు చేశాడు. నిన్న మొన్నటి దాక బాగా నమ్మకస్తుడు లాంటి జగన్ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం వెనుక కేసీఆర్ హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు.
అయితే తెరాసలో ఎందరో పెద్ద నేతలున్న కానీ అనుభవం తక్కువ ఉన్న ప్రశాంత్ రెడ్డిని రంగంలోకి దించటం వెనుక అసలు ఉద్దేశ్యం అయన కూడా జగన్ కులస్తుడు కావటమే. ఒక కులానికి చెందిన నేతపై అదే కులనేతతో విమర్శలు చేపించటం అనేది సహజంగా జరిగే విషయమే.. తెలంగాణ లో వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఉన్న రెడ్లు అనేక మందికి ఇప్పటికి కూడా జగన్ అంటే అభిమానం ఉంది. దీనితో జగన్ మీద వేరే నేతలెవరైనా విమర్శలు చేస్తే ఎక్కడ ఓటు బ్యాంకు దెబ్బ తింటుందో అని భావించిన కేసీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డిని రంగంలోకి దించాడు.
వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకి అని, సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్నా ఆయనే అడ్డుపడి అనేక మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణం అయ్యారని విమర్శించారు. వైఎస్సార్ ముమ్మాటికీ తెలంగాణ పాలిట రాక్షసుడేనని దుయ్యబట్టారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించిన నీటి దొంగేనన్నారు. వైఎస్‌ని మించి రెట్టింపు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఏమనాలి? అని మంత్రి వేముల ప్రశ్నించారు.
జల వివాదంలో జల వనరుల శాఖ మంత్రి కాకుండా, సీఎం లాంటి వ్యక్తి కాకుండా వేరే శాఖకు చెందిన మంత్రి ఈ స్థాయిలో విమర్శలు చేయటం ఏమిటో అదేమీ రాజకీయమో కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో జల వివాదంలో కేసీఆర్, జగన్ మధ్య చర్చలు జరిగాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్థాయి చర్చలు కాకుండా ఇలాంటి ఆరోపణలు చెప్పించటం వెనుక కేసీఆర్ అసలు ఉద్దేశ్యం ఏమిటో సృష్టంగా తెలుస్తుంది. సమస్యను పరిష్కరించాలంటే ఉన్నతమైన మంతనాలు జరగాలి కానీ, రెచ్చకొట్టే విధంగా ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది రాజకీయ లబ్ది కోసం తప్ప మరొకటి కాదని అర్ధం అవుతుంది.