KTR : విశాఖ ఉక్కు పై కేటీఆర్ ప్రకటన.. లోగుట్టు చాలానే ఉంది
KTR : నిన్నటికి నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రాలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని, అవసరం అయితే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకోని విశాఖ వచ్చి ఆందోళనలు చేస్తానని చెప్పటం జరిగింది. కేటీఆర్ లాంటి వ్యక్తి పక్కా రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమానికి అది కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వటం వెనుక ఎదో బలమైన కారణాలు ఉండి వుంటాయని కొందరు అంటున్న మాటలు.
KTR : ఎన్నికల కోసమేనా..?
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో తెరాస గెలుపు కోసం ఆంధ్ర ఓట్లు అవసరం వుంది. అదే విధంగా నాగార్జున సాగర్ కూడా ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు నియోజకవర్గం, అక్కడ కూడా ఆంధ్రుల ఓట్లు ప్రధానం. వారిని తమవైపు తిప్పుకోవడానికి కూడా కేటీఆర్ ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చు ఆంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అదే విధంగా ఆంధ్రులు ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా అభిమానించే నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన కొడుకు జగన్ రాజకీయాల్లోకి వస్తే ఆదరించి ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోంది. దీనితో ఇక్కడి ఆంధ్రులు ఆమె వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రుల విషయం పక్కన పెడితే, హైదరాబాద్ లోకల్ లో ఆంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెరాసకే తమ మద్దతు ప్రకటించారు ఆంధ్ర ఓటర్లు. ఇప్పుడు షర్మిల పార్టీ వస్తే అటు వైపు వెళ్లకుండా తెరాస వైపు ఉంచటానికి కూడా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు..?
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో మరికొన్ని కీలక అంశాలున్నాయి. ఎక్కడో విశాఖలో జరుగుతున్న ఉద్యమం కదా..మనకెందుకులే అనుకుంటే.. కేంద్రం తరువాతి కాలంలో మిగతా ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా ప్రైవేటుపరం చేస్తుంది. రేపు బీహెచ్ఈఎల్ అంటారు..ఎల్లుండి సింగరేణి అంటారు.. ఇలా పలు రాష్ట్రాల్లోని కంపెనీలను ప్రైవేటు పరం చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు పరస్పరం పోరాటానికి మద్దతుగా రావాలి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్వాగతించదగినవే.