Telangana Congress : 119 స్థానాలకు ఒకేసారి.. అభ్యర్థుల లిస్ట్ రెడీ?
Telangana Congress : తెలంగాణలో ఎన్నికల హడావుడి వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ తెలంగాణలో కాస్త జోరుమీదనే ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది. దీంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ 119 మంది అభ్యర్థులను రెడీ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీ అయింది స్క్రీనింగ్ కమిటీ. వరుస భేటీలను నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులను సెలెక్ట్ చేసేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. 80 మంది పేర్ల జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ అందించిందట. మిగిలిన చోట్ల అభ్యర్థుల ఎంపికపై కాస్త గందరగోళం నెలకొన్నది. బీఆర్ఎస్ లో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు అసంతృప్త నేతలను ఇప్పటికే కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకుంటోంది. బీఆర్ఎస్ లో అసంతృప్తిలో ఉన్న నేతలు కాంగ్రెస్ పిలుపు మేరకు హస్తం గూటికి చేరుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల టీకాంగ్రెస్ లోకి భారీగా చేరికలు పెరిగాయి. నేతల చేరికలపై దృష్టి పెడుతూనే అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేస్తోంది. ఇప్పటికే 80 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. త్వరలోనే మిగితా అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Telangana Congress : ప్లాన్ మారిందా? ఒకేసారి 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా?
ముందు 80 మంది అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినా.. ఒకేసారి 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని హస్తం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి ప్రకటించి వెంటనే ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం. ఇతర పార్టీల నుంచి నేతలు చేరడం, వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో.. సీనియర్ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారు. దీంతో వాళ్లను బుజ్జగిస్తూనే ఇతర పార్టీ నేతలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ కోసమే పని చేయాలని.. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు దక్కుతాయని హైకమాండ్ భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది.