Nara Lokesh : జగన్‌రెడ్డి అధికారమదాన్ని ఎదిరించి నిలిచారు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో తాజాగా విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ ఎక్కడ కూడా కనిపించలేదు. 75 మున్సిపాలిటీ స్థానాల్లో 73, ఫలితాలు వెలువడిన 11 కి 11 కార్పొరేషన్స్ వైసీపీ గెలిచి ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ కు తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. ఈ ఫలితాలతో టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల మాదిరి సైలెంట్ అయిపోయారు. ఇక పార్టీ శ్రేణులు అయితే పూర్తిగా డీలా పడ్డారు. ఇలాంటి స్థితిలో వాళ్లకు ప్రేరణ కలిగించాలి అనే ఉద్దేశ్యంతో టీడీపీ పార్టీ యువనేత లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలకవ్యాఖ్యలు చేశాడు.
Nara Lokesh : జగన్ రెడ్డి అధికారమదం !
మునిసిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పుని గౌరవిస్తున్నాం. ఎన్నికల కోసం రాత్రనక పగలనక శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు. ఈ ఎన్నికల్లో వైసీపీ అరాచకాన్ని, జగన్‌రెడ్డి అధికారమదాన్ని ఎదిరించి నిలిచి గెలిచినవారికి, పోరాడి ఓడిన వారికి.. అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలే జరపకూడదనుకున్న జగన్ రెడ్డి సర్కారు అప్రజాస్వామిక వైఖరిని ప్రజల ముందు ఉంచడంలో మనం సక్సెస్ అయ్యాం.
ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరించినా, నామినేషన్లు వేసిన కొందరిని చంపేసినా.. అదరక బెదరక తెలుగుదేశం సైనికులు ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీకి ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తామని ఓటర్లను భయపెట్టి జరిపిన ఎన్నికల ఫలితాలు చూసి నిరాశ చెందొద్దు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా… ప్రజాసమస్యలపై తెలుగుదేశం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఆ పోరాటంలో క్రమశిక్షణ, అంకితభావం కలిగిన సైనికులుగా పనిచేద్దాం.
ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువయ్యేందుకు కృషి చేద్దాం. అంటూ లోకేష్ మాట్లాడాడు.
అయితే ఇప్పుడు టీడీపీ కి తగిలిన ఈ దెబ్బ ఇలాంటి మాటలతో తగ్గేది కాదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. జగన్ పరిపాలన చేపట్టి రెండేళ్లు కావస్తున్నా కానీ, అటు గ్రామాల్లో కావచ్చు, ఇటు పట్టణాల్లో కావచ్చు, ఎక్కడ కనీసం కొంతైన వ్యతిరేకత అనేది కనిపించటం లేదు. దీనిని బట్టి చూస్తుంటే వచ్చే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి మరోసారి పట్టం కట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ గడ్డు పరిస్థితి నుండి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి.